Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతరిక్షంలో భారత సంతతి వ్యోమగామి శీర్షాసనం.. అక్క‌డ త‌మ‌కు వ్యాయామం ఎందుకంత ముఖ్యమో చెప్పిన‌ అనిల్ మీనన్

Anil Menon performs headstand in space and explains importance of exercise
Advertisement
  • వ్యాయామం లేకపోతే తీవ్ర ఆరోగ్య నష్టం తప్పదన్న‌ అనిల్ మీనన్ 
  • ప్రతినెలా 3% ఎముకల సాంద్రత కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
  • మైక్రోగ్రావిటీ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కఠిన వర్కౌట్లు తప్పనిసరి అని వెల్ల‌డి
  • 'స్టే హార్డ్' అంటూ సోషల్ మీడియాలో స్ఫూర్తిదాయక వీడియో పోస్ట్
Advertisement
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి, యూఎస్ స్పేస్ ఫోర్స్ కల్నల్ అనిల్ మీనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్‌) నుంచి ఒక స్ఫూర్తిదాయక వీడియోను పంచుకున్నారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేని (మైక్రోగ్రావిటీ) స్థితిలో వ్యాయామం ఎంత కీలకమో వివరిస్తూ.. ఆయన శీర్షాసనం వేయడంతో పాటు ఇతర కఠినమైన వర్కౌట్లు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. 

'స్టే హార్డ్!' (దృఢంగా ఉండండి) అనే క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశారు. అంతరిక్షంలో వ్యాయామం చేయడానికి ఏకాగ్రత, సంకల్పం, పట్టుదల ఎంతో అవసరమని అనిల్ మీనన్ పేర్కొన్నారు. వ్యోమగాములు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. 

సరైన శారీరక శ్రమ లేకపోతే, వ్యోమగాములు ప్రతి నెలా దాదాపు 3% ఎముకల సాంద్రతను, 10% నుంచి 15% వరకు కండర ద్రవ్యరాశిని, శరీర బరువును కోల్పోతారని తెలిపారు. అలాగే, ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను సూచించే VO2 మ్యాక్స్‌లో 10% కంటే ఎక్కువ తగ్గుదల కనిపిస్తుందని స్పష్టం చేశారు.

మైక్రోగ్రావిటీ వల్ల ఎముకలు, కండరాలపై యాంత్రిక భారం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది వాటి క్షీణతకు, హృదయ సంబంధిత ఫిట్‌నెస్ తగ్గడానికి దారితీస్తుంది. ఈ ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి వ్యోమగాములు రోజూ ప్రత్యేక పరికరాల సహాయంతో రెసిస్టెన్స్, కార్డియోవాస్కులర్ వర్కౌట్లు చేస్తారు. 

ఈ కఠినమైన శిక్షణ, అంతరిక్షంలో వారి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. సుదీర్ఘ మిషన్ల తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇక్కడి గురుత్వాకర్షణకు శరీరాన్ని సిద్ధం చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఈ సందర్భంగా తన స్నేహితుడు, వ్యక్తిగత శిక్షకుడు అయిన నేవీ కెప్టెన్ జాక్ హాత్వేను అనిల్ మీనన్ ప్రశంసించారు. తనను ఉన్నత స్థాయికి చేర్చడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని, ప్రముఖ అథ్లెట్ డేవిడ్ గోగిన్స్‌తో ఆయనను పోల్చారు. అత్యవసర వైద్య నిపుణుడైన అనిల్ మీనన్, ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగశాలలో తన మిషన్‌లో భాగంగా పలు పరిశోధనలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement
Anil Menon
NASA Astronaut
International Space Station
Space Exercise Benefits
Microgravity Health Effects
Indian Origin Astronaut

More Telugu News