Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

72 సెంటీమీటర్లే వెడల్పు.. ఇదో ఇల్లు అంటే నమ్మగలరా?

Just 72 Centimeters Wide Can You Believe This Is A House
Advertisement
  • వార్సాలోని ప్రత్యేక నిర్మాణం కెరెట్‌ హౌస్‌
  • రెండు భవనాల మధ్య అత్యంత ఇరుకైన చోట నిర్మాణం
  • వెడల్పు 72 సెం.మీ. మాత్రమే
  • మొత్తం విస్తీర్ణం 14.5 చదరపు మీటర్లు
  • ఆర్కిటెక్ట్‌ జకుబ్‌ షెజ్నీ డిజైన్‌
Advertisement
రెండు భవనాల మధ్య చిన్న ఖాళీ ఉంటే ఏం చేస్తారు? వదిలేస్తారు. కానీ పోలాండ్‌లోని ఓ ఆర్కిటెక్ట్‌ మాత్రం ఆ ఖాళీలోనే ఏకంగా ఓ ఇల్లు కట్టేశారు. అదే వార్సాలోని ‘కెరెట్‌ హౌస్‌’. ప్రపంచంలోనే అత్యంత సన్నని ఇళ్లలో ఒకటిగా పేరొందిన ఈ నిర్మాణం.. అత్యంత ఇరుకైన చోట కేవలం 72 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.

ఈ విచిత్రమైన ఇంటిని ఆర్కిటెక్ట్‌ జకుబ్‌ షెజ్నీ రూపొందించారు. రెండు పాత భవనాల మధ్య నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ఆయన ఇందుకోసం ఎంచుకున్నారు. దాదాపు 14.5 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. తొలుత ఇది ఓ ఆర్ట్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంది. తర్వాత నివాసం, రచనా స్థలంగా ఉపయోగపడేలా రూపొందించారు.

ఇంత చిన్న స్థలంలోనూ అవసరమైన సదుపాయాలన్నీ ఉండేలా డిజైన్‌ చేశారు. వంటగది, కూర్చునే స్థలం, పని చేసుకునే ప్రదేశం, బాత్‌రూమ్‌, నిద్రించే స్థలం ఇందులో ఉన్నాయి. ఇంటి నిర్మాణంలో ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా ఉపయోగించారు. సహజ కాంతి లోపలికి వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ ఇంటికి ఇజ్రాయెల్‌ రచయిత ఎట్గార్‌ కెరెట్‌ పేరు పెట్టారు. ఆయన కోసం దీన్ని రచనా స్థలంగా రూపొందించారు. వార్సాలోని యూదుల చరిత్రతో ముడిపడిన ప్రాంతంలో ఈ నిర్మాణం ఉండటంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం కూడా ఉంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సాధారణ భవన నిబంధనలు అడ్డంకిగా మారాయి. అందుకే దీనికి కళా ఖండంగా అనుమతులు తీసుకున్నారు. 2009లో ఆలోచనగా మొదలైన ఈ ప్రాజెక్టు 2012లో పూర్తయింది. ఆ తర్వాత కెరెట్‌ హౌస్‌ వార్సాలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.

రెండు భవనాల మధ్య కనిపించని చిన్న స్థలాన్ని కూడా ఉపయోగకరంగా మార్చొచ్చని ఈ ఇల్లు చూపిస్తోంది. స్థలం ఎంత చిన్నదైనా.. ఆలోచన పెద్దగా ఉంటే కొత్త రూపం ఇవ్వొచ్చని కెరెట్‌ హౌస్‌ నిరూపించింది.
Advertisement
Advertisement
Keret House
Jakub Szczesny
Warsaw Poland
World narrowest house
Etgar Keret
Tiny home architecture

More Telugu News