ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా లెవిట్ పదవీకాలం సమాప్తం

Karoline Leavitt steps down as White House Press Secretary in Trump administration
  • వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవి నుంచి కరోలిన్ లెవిట్ నిష్క్రమణ‌
  • ట్రంప్ ప్రభుత్వంలో ఆమె 19 నెలల పాటు సేవలందించిన లెవిట్‌
  • మీడియా పట్ల దూకుడైన వైఖరితో లెవిట్ తరచూ వార్తల్లో నిలిచిన వైనం
  • వైట్‌హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీలలో లెవిట్ ఒకరని ట్రంప్ ప్రశంస
  • కొత్త ప్రెస్ సెక్రటరీ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత ఇవ్వని వైట్‌హౌస్ 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవిలో మార్పు చోటుచేసుకుంది. 19 నెలలకు పైగా ఈ బాధ్యతల్లో కొనసాగిన కరోలిన్ లెవిట్ పదవీకాలం ముగిసింది. గురువారమే ఆమె చివరి పని దినమని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఆమె స్థానంలో కొత్తగా ఎవరు రానున్నారనే దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.

ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రెస్ సెక్రటరీగా నియమితులైన లెవిట్, ఈ పదవిని చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. తన పదవీకాలంలో అధ్యక్షుడికి, ఆయన 'అమెరికా ఫస్ట్' విధానాలకు ఆమె గట్టి మద్దతుదారుగా నిలిచారని వైట్‌హౌస్ ప్రశంసించింది. స్పష్టమైన, దృఢమైన వైఖరితో ఆమె తన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడింది. స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ.. "వైట్‌హౌస్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రెస్ సెక్రటరీలలో లెవిట్ ఒకరు" అని కితాబిచ్చారు.

టెలివిజన్ బ్రీఫింగ్‌లు, వార్తా కార్యక్రమాలలో తరచుగా కనిపిస్తూ లెవిట్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత సుపరిచితమైన ముఖంగా మారారు. ముఖ్యంగా మీడియా ప్రతినిధుల పట్ల ఆమె దూకుడైన వైఖరితో తరచూ వార్తల్లో నిలిచారు. ప్రభుత్వంపై వచ్చే తప్పుడు కథనాలను బ్రీఫింగ్ రూమ్‌లోనే సవాలు చేసేవారు. ఒకానొక సందర్భంలో విలేకరి ప్రశ్నకు "అదెంత తెలివి తక్కువ ప్రశ్న" అని ఘాటుగా సమాధానమివ్వడం ఆమె శైలికి అద్దం పడుతుంది.

అంతేగాక పాడ్‌కాస్ట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి కొత్త తరం మీడియా సంస్థలకు కూడా జేమ్స్ ఎస్. బ్రాడీ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి ప్రవేశం కల్పించడం లెవిట్ తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటి. దీనివల్ల సాంప్రదాయ మీడియా సంస్థలకు కేటాయించిన సీటింగ్ అమరికల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వలసలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, విదేశాంగ విధానం వంటి అంశాలపై ఆమె బ్రీఫింగ్‌లు కేంద్రీకృతమయ్యాయి. లెవిట్ తదుపరి ఏం చేయబోతున్నారనే దానిపై స్పష్టత లేనప్పటికీ, కీలక సమయంలో ఆమె నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Advertisement
Karoline Leavitt
Donald Trump
White House Press Secretary
US Politics
White House Briefing
America First

More Telugu News