రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. తీవ్ర ఇంధన సంక్షోభం!
- ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలోని ఆరు చమురు డిపోలు ధ్వంసం
- రష్యాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇంధన కొరత
- 73 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చేశామన్న రష్యా
- 72 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామన్న ఉక్రెయిన్
రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ తన డ్రోన్ దాడులను ముమ్మరం చేసింది. రష్యాలోని స్టావ్‌రోపోల్, ట్వెర్, ఉఫా ప్రాంతాలతో పాటు క్రిమియాలోని కీలక చమురు పంపింగ్ స్టేషన్‌లను తమ దళాలు పూర్తిగా ధ్వంసం చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. యుద్ధాన్ని ముగించడానికి మాస్కో నిరాకరిస్తుండడం వల్లే ఈ దాడులు పెంచామని, రష్యా వెనక్కి తగ్గే వరకు ప్రతిరోజూ అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తామని ఆయన హెచ్చరించారు.
నిన్న రాత్రి నుంచి ఈ తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ దాడుల్లో రష్యాలోని దాదాపు ఆరు చమురు డిపోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అజోవ్ సముద్రంలోని రెండు చమురు ట్యాంకర్లపై కూడా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల ప్రభావంతో రష్యాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇంధనం కోసం వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
తాము 73 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరోవైపు, నిన్న రాత్రి రష్యా దళాలు తమపై ప్రయోగించిన 94 డ్రోన్‌లు, రెండు బాలిస్టిక్ క్షిపణులలో 72 డ్రోన్‌లను సమర్థవంతంగా అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం వెల్లడించింది. ఈ పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య యుద్ధం సరికొత్త స్థాయికి చేరింది.