నా నోరు మూయించాలంటే.. నన్ను చంపాలి: బీజేపీపై మమత ఫైర్‌

Mamata Banerjee says to silence my voice you must kill me
  • అభిషేక్‌, మహువా, కల్యాణ్‌ బెనర్జీలను లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపణ
  • 2026 బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను దోచుకుని అధికారంలోకి వచ్చిందని విమర్శ
  • టీఎంసీ నేతల ఫిరాయింపుల మధ్య వీడియో సందేశం విడుదల చేసిన మమత
  • టీఎంసీకి రాజీనామా చేసిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం మధ్య ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన నోరు మూయించాలంటే తనను చంపాల్సిందేనని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలను భయపెట్టేందుకు, వేధించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

వీడియో సందేశం ద్వారా మాట్లాడిన మమతా బెనర్జీ.. టీఎంసీని వీడి బీజేపీలో చేరని వారికి శుభాకాంక్షలు తెలిపారు. తనపై, పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ.. "నన్ను మౌనంగా చేయాలంటే నన్ను చంపాల్సిందే. అందుకోసం కూడా మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా వదల్లేదు" అని వ్యాఖ్యానించారు.

లోక్‌సభ సభ్యులు అభిషేక్‌ బెనర్జీ, మహువా మొయిత్రా, కల్యాణ్‌ బెనర్జీలతో పాటు తన ఇంటిని కూడా లక్ష్యంగా చేసుకున్నారని మమత ఆరోపించారు. తమ పార్టీ నాయకులను నిరంతరం వేధిస్తున్నారని విమర్శించారు.

2026 పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిందని మమత ఆరోపించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) ప్రక్రియను దుర్వినియోగం చేసి, కేంద్ర బలగాల సహాయంతో కౌంటింగ్‌ కేంద్రాలను స్వాధీనం చేసుకుని ఎన్నికలను ప్రభావితం చేసిందని విమర్శించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం అనంతరం ఆ పార్టీలో సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడగా, కొందరు పార్టీ నాయకత్వం, ముఖ్యంగా అభిషేక్‌ బెనర్జీపై విమర్శలు చేశారు. పార్టీలో అవినీతి పెరిగిందని కూడా ఆరోపించారు.

మరోవైపు టీఎంసీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్‌ రాయ్‌, సుష్మితా దేవ్‌, ప్రకాశ్‌ చిక్‌ బరైక్‌ గురువారం బీజేపీలో చేరారు. అనంతరం జులై 24న జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలకు బీజేపీ వారిని అభ్యర్థులుగా ప్రకటించింది.
Advertisement
Mamata Banerjee
TMC vs BJP
West Bengal Politics
Abhishek Banerjee
Mahua Moitra
West Bengal Assembly Elections

More Telugu News