ఏపీలో పెట్టుబడులకు కొరియా సంస్థల సానుకూలత.. మంత్రి లోకేశ్‌ పర్యటన సఫలం

Korean companies positive about AP investments Minister Lokesh tour successful
  • దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్‌
  • నాయుడుపేటలో రూ.1,595 కోట్లతో ప్లాంట్ ఏర్పాటు చేయనున్న షిన్‌హ్యుప్
  • ఈ ప్లాంట్ ద్వారా 2,170 మందికి ఉద్యోగ అవకాశాలు
  • శ్రీసిటీలో ఈవీ విడిభాగాల యూనిట్ ఏర్పాటు చేయాలని మోటివ్‌లింక్‌కు విజ్ఞప్తి
  • ఏపీలో ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని కోరిన లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ హబ్‌గా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సియోల్‌లో ప్రముఖ ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ సంస్థలైన మోటివ్‌లింక్, షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ యాజమాన్యాలతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీలో తయారీ యూనిట్లు స్థాపించి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు.

నాయుడుపేటలో షిన్‌హ్యుప్ భారీ పెట్టుబడి
ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల (పీసీబీ) తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన షిన్‌హ్యుప్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ టేహూ కిమ్‌తో మంత్రి లోకేశ్‌ సమావేశమయ్యారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.1,595 కోట్ల భారీ పెట్టుబడితో తమ సంస్థ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా టేహూ కిమ్ ప్రకటించారు. ఈవీ/ఆటో, హెల్త్‌కేర్, స్మార్ట్ మీటరింగ్ రంగాలకు అవసరమైన పీసీబీలు, సీసీఎల్, ఈఎంఎస్‌లను ఇక్కడ తయారు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2,170 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.

ఏపీని తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్నందుకు షిన్‌హ్యుప్ యాజమాన్యానికి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. నాయుడుపేట వద్ద ఇప్పటికే అభివృద్ధి చేసిన పీసీబీ ఎకోసిస్టమ్‌లో సిర్మా, జెట్‌వర్క్, ఎపిటోమ్, సిప్సా టెక్ వంటి నాలుగు కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో ఏపీలో ఒక ఎండ్-టు-ఎండ్ పీసీబీ క్లస్టర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని షిన్‌హ్యుప్‌ను కోరారు. ఈ ప్రతిపాదనను సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టేహూ కిమ్ హామీ ఇచ్చారు.

శ్రీసిటీకి మోటివ్‌లింక్‌ను ఆహ్వానించిన లోకేశ్‌ 
ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ మోటివ్‌లింక్ సీఈవో కిమ్ కి-హాన్‌తో కూడా మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. శ్రీసిటీలో ఈవీ విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్, ఇతర మాగ్నెటిక్స్ కాంపొనెంట్స్ తయారుచేసే యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు శ్రీసిటీలో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఇప్పటికే శ్రీసిటీలో ఎంసీఎన్ఈఎక్స్‌, సోలమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వంటి కొరియన్ కంపెనీలు విజయవంతంగా పనిచేస్తున్నాయని గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన మోటివ్‌లింక్ సీఈవో కిమ్ కి-హాన్, తమ సంస్థ ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టిందని తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో స్టెర్లింగ్ టూల్స్‌తో కలిసి ఒక జాయింట్ వెంచర్‌ను, శ్రీపెరంబుదూర్-ఒరగడమ్ ఆటో క్లస్టర్‌లో తమ తొలి స్వతంత్ర ప్లాంట్‌ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని ఆయన మంత్రి లోకేశ్‌కు హామీ ఇచ్చారు. మొత్తం మీద లోకేశ్‌ కొరియా పర్యటన ఏపీకి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో సానుకూల ఫలితాలనిస్తోంది.

Advertisement
Nara Lokesh
Andhra Pradesh Investments
Shinhyeop Electronics
South Korea Visit
Naidupeta PCB Plant
Motivelink EV Manufacturing

More Telugu News