ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. కడప, రాజంపేటల్లో కోవిడ్ లక్షణాలతో ఇద్దరి మృతి!

COVID19 stir in Andhra Pradesh as two die with symptoms in Kadapa and Rajampeta
  • ఏపీలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా
  • తీవ్ర కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి
  • ప్రైమరీ కాంటాక్ట్స్ వివరాలను సేకరిస్తున్న మెడికల్ టీమ్స్

ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


వివరాల్లోకి వెళితే... జిల్లాలో ఇటీవల కొందరికి అనుమానంతో చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, కడప నగరంతో పాటు రాజంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.


ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కడప, రాజంపేటల్లోని బాధిత ప్రాంతాలలో స్పెషల్ మెడికల్ టీమ్స్ పర్యటిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులతో పాటు, వారితో ప్రాథమికంగా పరిచయం ఉన్నవారి (ప్రైమరీ కాంటాక్స్) వివరాలను సేకరిస్తున్నారు. స్థానికంగా ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉన్నాయా అనే అంశంపై ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.


మరణానికి గల కచ్చితమైన కారణాలు, వైరస్ యొక్క కొత్త వేరియంట్ ఏమైనా ఉందా అనే కోణాన్ని నిర్ధారించుకోవడానికి బాధితుల నమూనాలను సేకరించి, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అయితే, జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, ఈ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. అధికారులు అధికారికంగా నిర్ధారించే వరకు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
COVID-19
Andhra Pradesh
Kadapa
Rajampeta
Coronavirus symptoms
Health department survey

More Telugu News