‘ముందు మంచి తల్లిగా మారండి.. తర్వాత ఐఏఎస్‌ అవ్వండి’.. యూపీ గవర్నర్‌ సూచన

Anandiben Patel Suggests Becoming A Good Mother Before Becoming An IAS Officer
  • పెళ్లి తర్వాత అమ్మాయిలు చదువు ఆపొద్దన్న ఆనందీబెన్‌
  • ఉద్యోగం, కుటుంబం మధ్య సమతుల్యం అవసరమన్న గవర్నర్‌
  • పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచన
  • మాదకద్రవ్యాలపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌
  • నైతిక విలువలతోనే విద్య పరిపూర్ణమని వ్యాఖ్య
వృత్తి జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా కుటుంబ బాధ్యతలను విస్మరించొద్దని ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ యువతులకు సూచించారు. ఐఏఎస్‌ అధికారి అయినా, ఉపాధ్యాయురాలు అయినా ముందు మంచి తల్లిగా మారాలని అన్నారు. కాన్పూర్‌లో జరిగిన ఓ విశ్వవిద్యాలయ 41వ స్నాతకోత్సవంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి తర్వాత చదువు ఆపొద్దని యువతులకు ఆనందీబెన్‌ సూచించారు. ఉన్నత విద్యను కొనసాగిస్తూ ఉద్యోగాలు చేయాలని, అదే సమయంలో కుటుంబానికి కూడా సమయం కేటాయించాలని చెప్పారు. ఇంట్లో వండే ఆహారం ఎలా తయారు చేయాలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని వ్యాఖ్యానించారు. చదువు, ఉద్యోగం, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యం పాటించాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై నిరంతరం దృష్టి పెట్టాలని గవర్నర్‌ సూచించారు. పాఠశాల, కళాశాలల్లో చేరిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా వారి భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

విశ్వవిద్యాలయాల పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగంపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్‌ డెలివరీ బాక్సుల ద్వారా మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు రాజ్‌భవన్‌ ఏర్పాటు చేసిన బృందం గుర్తించిందని చెప్పారు. అధికార యంత్రాంగం జోక్యంతో ఆ వ్యవస్థను అడ్డుకున్నట్లు వెల్లడించారు.

సమాజంలో మహిళలపై నేరాలు పెరగడానికి నైతిక విలువలు తగ్గిపోవడమే కారణమని ఆనందీబెన్‌ అన్నారు. కేవలం డిగ్రీలు, మార్కులు సాధిస్తే సరిపోదని, మంచి విలువలు కూడా అలవర్చుకోవాలని సూచించారు. విద్య అంటే ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించాలని పిలుపునిచ్చారు.
Advertisement
Anandiben Patel
Uttar Pradesh Governor
Kanpur University Convocation
Women Education and Family
IAS Career Advice
Drug Abuse in Universities

More Telugu News