గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది!

Google Chrome 150 update back button feature for Android users is here
  • ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్‌లో కొత్తగా బ్యాక్ బటన్ ఫీచర్
  • క్రోమ్ 150 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన మార్పులు
  • మెనూలోనే బ్యాక్ బటన్.. సులభమైన బ్రౌజింగ్ నావిగేషన్
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. వినియోగదారులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 'బ్యాక్ బటన్' ఫీచర్‌ను తన మెనూలో అధికారికంగా చేర్చింది. క్రోమ్ 150 వెర్షన్‌లో భాగంగా ఈ మార్పు అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల బ్రౌజర్‌లో వివిధ వెబ్ పేజీలను సెర్చ్ చేసే సమయంలో వెనక్కి వెళ్లడం వినియోగదారులకు మరింత సులభతరం కానుంది.

ఇంతకుముందు క్రోమ్ త్రీ-డాట్ మెనూలో కేవలం ఫార్వర్డ్ బటన్ మాత్రమే ఉండేది. వెనక్కి వెళ్లాలంటే ఫోన్ సిస్టమ్ బ్యాక్ జెస్టర్ లేదా నావిగేషన్ బటన్లపైనే వాడాల్సి ఆధారపడాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో ఈ జెస్టర్లు యాప్‌లోని ఇతర ఫంక్షన్లతో ఇబ్బందులు సృష్టించేవి. ఈ సమస్యను అధిగమించేందుకు, గూగుల్ ఇప్పుడు ఫార్వర్డ్ బటన్ పక్కనే బ్యాక్ బటన్‌ను కూడా చేర్చింది. ఐఓఎస్ పరికరాల్లోని క్రోమ్‌ బ్రౌజర్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

ఈ అప్‌డేట్‌లో బ్యాక్ బటన్‌తో పాటు మెనూలో మరికొన్ని కీలక మార్పులు కూడా చోటుచేసుకున్నాయి. గతంలో ఉన్న 'ఇన్ఫో' బటన్‌ను తొలగించి, దాని స్థానంలో 'సైట్ కంట్రోల్స్' అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల బుక్‌మార్క్ స్టార్, డౌన్‌లోడ్ ఐకాన్‌ల స్థానాల్లో మార్పులు జరిగాయి. అలాగే, 'యాడ్ టు హోమ్ స్క్రీన్' ఆప్షన్‌ను 'ఇన్‌స్టాల్ అండ్ క్రియేట్ షార్ట్‌కట్'గా గూగుల్ మార్చింది.

ప్రస్తుతం క్రోమ్ 150 వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో అందరికీ ఈ అప్‌డేట్ లభించనుంది. ఈ మార్పులు చిన్నవే అయినప్పటికీ, మొబైల్ బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే దిశగా గూగుల్ తీసుకున్న సానుకూల చర్యగా దీనిని అభివర్ణించవచ్చు.
Advertisement
Google Chrome
Chrome 150 Update
Android Chrome Back Button
Chrome Site Controls
Google Chrome Features

More Telugu News