పవన్ కు కులం రంగు పులిమారు... అనితను మేకప్ పేరిట అవమానించారు: సీఎం చంద్రబాబు
- ప్రత్యర్థి పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజం
- పవన్, అనితపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం
- రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపణ
- వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేసిన చంద్రబాబు
- నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ
వైసీపీ నేతలు అమరావతిపై కుట్ర చేయడానికే అక్కడికి వెళ్లారని, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకే రైతులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. "గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉంది. బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రాబందుల్లా వేచి ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ఆ పార్టీకి లేదు. దేవాలయాలపై దాడులు చేసిన వాళ్లే ఇప్పుడు గుళ్లకు వెళ్లి నాటకాలు ఆడుతున్నారు. వాళ్లవి పూర్తిగా క్రిమినల్ పాలిటిక్స్. ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోంది" అని అన్నారు.
గత పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పులు, వ్యవస్థల విధ్వంసంతో రాష్ట్రం నలిగిపోయిందని, ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కూడా తనపైనే ఉందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పునరావాసం కింద రైతులకు రూ.300 కోట్లు అందించామని, త్వరలోనే మరో రూ.600 కోట్లు విడుదల చేస్తామన్నారు. వెలిగొండతో రెండు దశల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.
"నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామరక్ష. గోదావరి నుంచి కావేరి వరకు నీటిని తీసుకెళ్లి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఈ విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదు. రైతు ప్రయోజనాలే ముఖ్యం" అని సీఎం స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, రామాయపట్నం పోర్టును పూర్తి చేసి పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డీబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.