ఢిల్లీలో తీవ్ర భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం
- ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో శనివారం సాయంత్రం భూప్రకంపనలు
- ఆఫ్ఘనిస్థాన్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడి
- భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన 6.2 తీవ్రత కలిగిన భారీ భూకంపం కారణంగానే ఈ ప్రకంపనల వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 7:04 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో, భూమికి 215 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ భూకంప ప్రభావంతో జమ్ముకశ్మీర్, ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో భూమి స్పష్టంగా కంపించింది. బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోవడంతో నివాసితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. పలుచోట్ల ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో గుమిగూడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూశాయి. అయితే, ఈ భూప్రకంపనల వల్ల భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు స్పష్టం చేశారు.