వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే యువతి మృతి!
- నాసిక్‌లో వ్యాక్సినేషన్ కేంద్రం వెలుపల ఘటన
- ముందస్తు చర్యగా సదరు వ్యాక్సిన్ బ్యాచ్ పూర్తిగా నిలిపివేత
- ఒకే వయల్ నుంచి వ్యాక్సిన్ తీసుకున్న మిగతా ఆరుగురు సురక్షితం
- మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభం
జూన్ 25న నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కామట్‌వాడే ప్రాంతంలో ఉన్న దక్షిణముఖి హనుమాన్ ఆలయం సమీపంలో ఈ వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహించారు. మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో శ్రావణి పాటిల్ ఈ బూస్టర్ షాట్ తీసుకుంది. అయితే, ఇంజక్షన్ తీసుకుని బయటకు వచ్చిన కాసేపటికే తనకు కళ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తోందని కంగారుపడింది. పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ సమీపంలోకి రాగానే స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ కుమార్తె చనిపోయిందని, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ దేవ్‌కర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. శ్రావణికి ఇచ్చిన వ్యాక్సిన్ వయల్ (సీసా) నుంచే మరో ఆరుగురికి కూడా డోసులు ఇచ్చామని.. వారిలో నలుగురు గర్భిణులు, 16 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలుడు ఉన్నారని, వారంతా ప్రస్తుతం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నారని ఆయన వివరించారు.
ప్రస్తుతానికి అంబద్ పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. పోస్ట్‌మార్టం ప్రక్రియ ముగిసిన తర్వాత, మృతికి గల అసలు కారణాలను విశ్లేషించేందుకు విసెరా (Viscera Samples) నమూనాలను ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపించారు. అంతేకాకుండా, దీనిపై ఉన్నత స్థాయి ఏఈఎఫ్ఐ (AEFI - Adverse Event Following Immunisation) కమిటీని రంగంలోకి దించారు. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులకు కూడా ఈ సమాచారాన్ని అందించారు. ల్యాబ్ నివేదికలు వస్తే తప్ప వ్యాక్సిన్ వల్లే మరణం సంభవించిందా లేదా ఇతర వైద్యపరమైన కారణాలు ఉన్నాయా అనేది స్పష్టమవుతుందని అధికారులు పేర్కొన్నారు.