ఆధార్ నంబర్ కొడితే చాలు.. అన్ని వివరాలు రావాలి: మంత్రి నారా లోకేశ్
- ఆర్టీజీఎస్ సేవలపై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- ఆధార్ నంబర్‌తోనే అన్ని సర్టిఫికెట్ల డిజిటల్ వెరిఫికేషన్
- మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన
- కుల, ఆదాయ ధృవపత్రాల జారీ ప్రక్రియ మరింత సులభతరం
- డేటా లేక్ ద్వారా ప్రభుత్వ శాఖల సమాచారం అనుసంధానం
- ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పటిష్ఠ చర్యలకు ఆదేశం
శుక్రవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ లక్ష్యాలు, ప్రాజెక్టుల పురోగతిని ఆ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల సమాచారాన్ని ఒకేచోట క్రోడీకరించే 'డేటా లేక్' పనులను జులై నాటికి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల సంఖ్యను డేటా లేక్ ద్వారా విశ్లేషించి, వారిని తిరిగి బడికి రప్పించే మార్గాలను అన్వేషించాలని సూచించారు. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్‌తో అనుసంధానించాలన్నారు.
ప్రజా సేవలు మరింత చేరువ కావాలి
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై నెలరోజుల పాటు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్ ఆదేశించారు. ఈ సేవలను ఎలా వినియోగించుకోవాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో ఉన్న అడ్డంకులను తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, పేర్ల చేర్పులు, తొలగింపుల ప్రక్రియను మరింత సరళతరం చేయాలని స్పష్టం చేశారు.
ఎల్‌నినో, విద్యుత్ డిమాండ్‌పై అప్రమత్తత
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలవనరులు, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. నీటి వృథాను అరికట్టి, తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. జలాశయాల్లో నీటి లభ్యత, భూగర్భజలాల స్థాయిని ఆర్టీజీఎస్‌లోని 'అవేర్' విభాగం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ముఖ్యంగా రాయలసీమలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల జల విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నందున, విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.