రామమందిర నిధుల రగడ... బాబ్రీ మసీదు విరాళాలపై ప్రశ్నించిన యూపీ ఉపముఖ్యమంత్రి
- విపక్షాలు సనాతన ధర్మంపై కుట్ర చేస్తున్నాయన్న బ్రజేష్ పాఠక్
- విపక్షాలవి బుజ్జగింపు రాజకీయాలని విమర్శ
- అయోధ్య నిధుల గోల్‌మాల్ కేసులో ఎనిమిది మంది అరెస్ట్
- విపక్షాలవి బుజ్జగింపు రాజకీయాలని యూపీ ఉపముఖ్యమంత్రి విమర్శ
మిర్జాపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, రామమందిర విరాళాల వివాదం వెనుక సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల కుట్ర ఉందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం, ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆ పార్టీలు సనాతన ధర్మాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని విమర్శించారు. "గతంలో బాబ్రీ మసీదు కోసం కూడా విరాళాలు సేకరించారు. ఆ నిధులు ఏమయ్యాయో ఎవరూ అడగరు. విపక్షాలవి కేవలం బుజ్జగింపు రాజకీయాలే" అని ఆయన దుయ్యబట్టారు. ఆ నిధుల వివరాలపై విపక్ష నేతలను ప్రశ్నించాలని ఆయన మీడియాకు సూచించారు.
అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదు మేరకు సిట్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో అయోధ్య పోలీసులు గురువారం ఎనిమిది మందితో పాటు మరికొందరిపై దొంగతనం, నేరపూరిత నమ్మకద్రోహం, కుట్ర వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తుపై బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ, తమ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులే నిష్పక్షపాతంగా విచారణ జరుపుతారని ఆయన పేర్కొన్నారు.