అయోధ్య రామ జన్మభూమి విరాళాల సేకరణలో రూ. 200 కోట్ల అవినీతి జరిగింది: ఎంపీ చామల
- యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాలని చామల డిమాండ్
- విరాళాల సొమ్ముతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపాటు
- మమత, థాకరేలకు చెందిన ఎంపీలను ఈ సొమ్ముతోనే కొనుగోలు చేశారని ఆరోపణ
అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల సేకరణలో ఏకంగా రూ. 200 కోట్ల భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పినప్పటికీ... యూపీ సిట్ పోలీసులు ఆయన సొంత మనుషులనే అరెస్ట్ చేశారని తెలిపారు. కేవలం చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పదవుల నుంచి తప్పించి బీజేపీ చేతులు దులుపుకుంటే సరిపోదని, ఈ స్కామ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని, దేవుడి కోసం సేకరించిన విరాళాల సొమ్ముతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని చామల మండిపడ్డారు. బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన 20 మంది ఎంపీలను, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఆరుగురు ఎంపీలను ఒక్కొక్కరికీ రూ. 75 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడానికి ఈ రాముడి సొమ్మునే వాడారంటూ తీవ్రస్థాయిలో ఆరోపించారు.
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడారని... ఇప్పుడు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను కేవలం పదవుల నుంచి తప్పిస్తే సరిపోదని అన్నారు.