వీడియో: తప్పిన పెను ప్రమాదం.. విమానం వైరల్ విన్యాసం!
- అమెరికాలోని హార్స్‌షూ బే రిసార్ట్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
- అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించిన విమానం
- మలుపు తిరిగే సమయంలో కుడి రెక్క భూమికి దగ్గరగా వెళ్లిన వైనం
- సురక్షితంగా ఫోర్ట్ వర్త్ అలయన్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్
- ఖతార్ ఎయిర్వేస్కు అప్పగించే ముందు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఘటన
జూన్ 24న జరిగిన ఈ ఘటనలో విమానం రన్‌వేపై అత్యంత తక్కువ ఎత్తులో ఫ్లైపాస్ చేసిన తర్వాత కుడివైపు మలుపు తిరిగింది. ఈ సమయంలో విమానం కుడి రెక్క నేలను తాకినంత పనైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానం సురక్షితంగా ఫోర్ట్ వర్త్ అలయన్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది.
ఈ విమానం ఖతార్ ఎయిర్వేస్ కార్గో రంగుల్లో ఉండటంతో తొలుత ఆ సంస్థ విమానమనే ప్రచారం జరిగింది. అయితే టెక్సాస్‌కు చెందిన లీజింగ్ సంస్థ జెట్రాన్ స్పందిస్తూ.. విమానం ఇంకా తమ అధీనంలోనే ఉందని తెలిపింది. ఖతార్ ఎయిర్వేస్కు అప్పగించే ముందు నిర్వహిస్తున్న పరీక్షల్లో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. అలాగే ఈ విమానాన్ని నడిపిన పైలట్లు ఖతార్ ఎయిర్వేస్కు చెందిన వారు కాదని స్పష్టం చేసింది.
200 అడుగులకు పైగా రెక్కల విస్తీర్ణం ఉన్న ఇలాంటి భారీ విమానాలు తక్కువ ఎత్తులో మలుపులు తిరిగేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.