ఉద్యోగులకు సోనీ షాక్: 'డెస్టినీ 2' ముగియడంతో వేలాది మంది ఇంటికి
- గేమింగ్ డెవలపర్ సంస్థ 'బంగీ'లో భారీగా ఉద్యోగుల తొలగింపు
- 'డెస్టినీ' బృందంతో పాటు 'మారథాన్' టీమ్‌లోని సభ్యులపై వేటు
- ఆశించిన స్థాయిలో రాణించని డెస్టినీ 2 గేమ్ అమ్మకాలు
- భవిష్యత్ ప్రాజెక్టుల రీ-ఆర్గనైజేషన్ కోసమే లేఆఫ్స్ అన్న యాజమాన్యం
ఇటీవలి కాలంలో సంస్థ ఆశించిన స్థాయిలో 'డెస్టినీ 2' గేమ్ రాణించకపోవడమే ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని జూన్ 25న విడుదల చేసిన అధికారిక ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది. బంగీ సంస్థతో పాటు వీరికి సపోర్ట్ అందిస్తున్న సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ సిబ్బంది కూడా ఈ తొలగింపుల బారిన పడ్డారు.
ఈ సంక్షోభంపై బంగీ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "గడిచిన కొన్నేళ్లుగా డెస్టినీ 2 గేమ్ మా అంచనాలను అందుకోవడంలో విఫలమైందనే నిజాన్ని మేము అంగీకరిస్తున్నాం. ఈ గేమ్ చివరి కంటెంట్ అప్డేట్ కూడా ముగిసింది. మా తదుపరి కొత్త ప్రాజెక్టులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత భారీ సిబ్బందితో కంపెనీని నడపడం సాధ్యం కావడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లేస్టేషన్ స్టూడియోస్ అధినేత హెర్మెన్ హల్స్ట్ కూడా ఈ నిర్ణయం చాలా బాధాకరమైనదే అయినప్పటికీ.. కంపెనీ భవిష్యత్తు, దీర్ఘకాలిక లక్ష్యాల దృష్ట్యా తప్పలేదని పేర్కొన్నారు.
దాదాపు పదేళ్ల పాటు నిరంతర సేవలందించిన ‘డెస్టినీ 2’ లైవ్ సర్వీస్ అప్డేట్స్ ఈ జూన్ నెలతో పూర్తిగా ముగిశాయి. ఇకపై ఈ గేమ్ అందుబాటులో ఉన్నప్పటికీ, దీనికి సంబంధించిన కొత్త వెర్షన్స్ లేదా ‘డెస్టినీ 3’ని తీసుకొచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని కంపెనీ తేల్చి చెప్పింది. అలాగే ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘మారథాన్’ గేమ్ కూడా మార్కెట్లో ఆశించిన స్థాయిలో పోటీని తట్టుకోలేక వెనుకబడింది.
ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిర్మాణ వ్యయం, మారుతున్న యూజర్ల అభిరుచుల కారణంగా దాదాపు అన్ని పెద్ద స్టూడియోలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే బంగీ సంస్థ 2023, 2024ల తర్వాత ఇప్పుడు మరోసారి లేఆఫ్స్ ప్రకటించాల్సి వచ్చింది. అయితే, ఉద్యోగాలు కోల్పోయిన వారికి సోనీ నెట్‌వర్క్‌లోని ఇతర విభాగాల్లో అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.