జైషే కమాండర్‌తో పెళ్లికి ప్లాన్.. పాక్ వెళ్లేందుకు సిద్ధమైన జైపూర్ మహిళ అరెస్ట్

Babita Dhakad Jaipur woman planning to marry Jaish commander arrested
  • జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు
  • ఉగ్రవాద సంస్థ కమాండర్‌ను పెళ్లాడాలని నిర్ణయం
  • నేపాల్ మీదుగా పాకిస్థాన్ వెళ్లేందుకు మహిళ ప్లాన్
  • మసూద్ అజహర్ బంధువులు సహా పలు పాక్ నంబర్ల గుర్తింపు
  • ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షణ 
  • పేరు మార్చుకున్నట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడి
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్‌తో సంబంధాలు కలిగి ఉందనే ఆరోపణలపై జైపూర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సదరు మహిళ పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాద కమాండర్‌ను వివాహం చేసుకోవడానికి నేపాల్ మీదుగా పాక్ వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇచ్చిన పక్కా సమాచారంతో జైపూర్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా అనే మహిళను ఏటీఎస్ గత వారం అదుపులోకి తీసుకుంది. ఆమెపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో విచారిస్తున్నారు.

నిందితురాలి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ఫోరెన్సిక్ పరిశీలన చేయగా, ఆమె మొబైల్‌లో పాకిస్థాన్ నంబర్లు ఉన్నట్లు తేలింది. జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ సన్నిహిత బంధువు యూసుఫ్ అజహర్, అలాగే భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖారీ జరార్‌కు సంబంధించిన నంబర్లు ఆమె కాంటాక్ట్స్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు అబు ఉబైదా అనే వ్యక్తితో ఆమె నిరంతరం చాటింగ్ చేస్తూ భావోద్వేగ బంధాన్ని పెంచుకుందని, అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని దర్యాప్తులో తేలింది.

ఈ ఏడాది నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో నేపాల్, సౌదీ అరేబియా లేదా యూఏఈ మీదుగా పాకిస్థాన్ చేరుకోవడానికి బబిత ప్లాన్ చేసినట్లు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితురాలైన ఆమె, తన పేరును కూడా 'ఖదీజా'గా మార్చుకుంది.

సంగనేర్ సమీపంలోని సీతాపుర లేదా వాటికా ప్రాంతంలో ఉంటున్న బబిత సాధారణ గృహిణి అని, అరెస్ట్‌కు కొన్ని వారాల ముందు నుంచే ఆమెపై నిఘా పెట్టామని అధికారులు తెలిపారు. ఉగ్రవాద నెట్‌వర్క్ ఆమెను డిజిటల్ లేదా ఇతర సహాయక చర్యల కోసం ఏమైనా వాడుకోవాలని చూసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వాట్సాప్ చాట్లు, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ ఏటీఎస్ బృందం విచారణను ముమ్మరం చేసింది.
Babita Dhakad
Jaish e Mohammed
Rajasthan ATS
Jaipur woman arrest
Terror commander marriage
UAPA case Rajasthan

More Telugu News