ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 18 సిరీస్ ధరలపై ఊరట కలిగించే వార్త!
- ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు
- గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం
- 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక
- మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం
- సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్
మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ధరల పెంపు తప్పదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 సిరీస్ ధరలు గణనీయంగా పెరుగుతాయన్న వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా ఐఫోన్ 18 ప్రో మోడల్ ధర ఐఫోన్ 17 ప్రోతో పోలిస్తే 200 డాలర్లు వరకు పెరగవచ్చని గతంలో కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి అంత తీవ్రంగా లేదని తెలుస్తోంది. జేపీ మోర్గాన్ విశ్లేషణ ఆధారంగా వచ్చిన తాజా అంచనాల ప్రకారం ఐఫోన్ 18 సిరీస్‌పై కేవలం 50 డాలర్ల మేర మాత్రమే ధర పెంపు ఉండే అవకాశం ఉంది.
ఈ అదనపు తయారీ వ్యయాన్ని తగ్గించేందుకు యాపిల్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం క్వాల్‌కామ్ మోడెమ్‌లను ఉపయోగిస్తున్న కంపెనీ, ఐఫోన్ 18 సిరీస్‌లో సొంతంగా అభివృద్ధి చేసిన ‘యాపిల్ C సిరీస్’ మోడెమ్‌లను వినియోగించవచ్చని సమాచారం. దీంతో ఖర్చులను కొంత మేర నియంత్రించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.
గత ఏడాది విడుదలైన ఐఫోన్ 17 ప్రో భారత మార్కెట్లో రూ.1.34 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 18 సిరీస్‌పై 50 డాలర్ల పెంపు అమలైతే భారత మార్కెట్లో కూడా ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. అయితే గతంలో ప్రచారం జరిగినట్లుగా భారీ పెరుగుదల ఉండకపోవచ్చని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.