రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోంది: జగన్

YS Jagan Mohan Reddy says Andhra Pradesh is heading towards economic recession
  • డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీపై కూటమి ప్రభుత్వం మాట తప్పిందన్న జగన్
  • వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మండిపాటు
  • 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని విమర్శ
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చిన కీలక హామీలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీ పథకాన్ని నిలిపివేసి మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తోందంటూ ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ఏపీలో పన్ను ఆదాయ వృద్ధి పడిపోయిందని, రాష్ట్రం ఆర్థిక మాంద్యం వైపు వెళ్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.


ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని సూపర్ సిక్స్ తరహాలో హామీ ఇచ్చిందని జగన్ అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పారని మండిపడ్డారు. తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.4,969 కోట్ల మేర వడ్డీ రాయితీతో పాటు ఆసరా, చేయూత వంటి స్కీమ్స్‌తో ఆర్థిక భరోసా ఇచ్చామని తెలిపారు.


కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రాయితీ కింద ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని జగన్ ఆరోపించారు. 2025-26 బడ్జెట్‌లో రూ.100 కోట్లు, మళ్లీ ఇప్పుడు 2026-27 బడ్జెట్‌లోనూ రూ.100 కోట్లు కేటాయించినప్పటికీ.. ఆ నిధులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, గ్రౌండ్ లెవెల్లో ఒక్క పైసా కూడా విడుదల కాలేదన్నారు. ఈ వడ్డీ రాయితీ అమలు చేయకపోవడం వల్ల గత రెండేళ్లలో డ్వాక్రా మహిళలకు సుమారు రూ.6 వేల కోట్ల మేర నష్టం జరిగిందని విమర్శించారు.


2023-24లో రూ.49,696 కోట్లుగా ఉన్న డ్వాక్రా రుణ వృద్ధి.. కూటమి పాలనలో 2024-25 నాటికి రూ.41,623 కోట్లకు, 2025-26లో మరింత తగ్గి రూ.41,105 కోట్లకు పడిపోయిందని అన్నారు. అంతేకాదు, 2025-26లో రాష్ట్ర పన్ను ఆదాయ వృద్ధి -3.22 శాతంగా నమోదైందని... ఇది ఏపీలో స్పష్టమైన ఆర్థిక మాంద్యానికి సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రం మరింత సంక్షోభంలో పడుతుందని హెచ్చరిస్తూ, బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

YS Jagan Mohan Reddy
Andhra Pradesh Economic Recession
DWCRA Women Interest Subsidy
Chandrababu Naidu Government
AP Tax Revenue Growth
YSRCP Leader Jagan

More Telugu News