శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
- మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు
- పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ
- తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్
నేషనల్ పాలిటిక్స్‌లో ఎప్పుడూ అటాక్ మోడ్‌లో ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఈసారి మాత్రం ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు కార్తికేయ సింగ్ చౌహాన్‌పై గతంలో తాను చేసిన కామెంట్స్ పట్ల రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాహుల్ తరఫు లాయర్ సమర్పించిన ఒక స్పెషల్ పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
గత మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ... శివరాజ్ సింగ్ చౌహాన్ ఫ్యామిలీని, ముఖ్యంగా ఆయన కొడుకు కార్తికేయ సింగ్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కార్తికేయ అస్సలు తగ్గలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన క్యారెక్టర్‌ను, ప్రతిష్టను దెబ్బతీసేలా రాహుల్ మాట్లాడారంటూ భోపాల్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు ఫైల్ చేశారు.
ఈ కేసు తీవ్రతను తగ్గించి, దీని నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. "ఆనాడు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావు, పొరపాటున అలా జరిగిపోయింది" అని పేర్కొంటూ కోర్టు వేదికగా విచారం వ్యక్తం చేశారు. ఈ పొరపాటును పరిగణనలోకి తీసుకుని కేసు తీవ్రతను తగ్గించాలని కోర్టును కోరారు. రాహుల్ విన్నపంపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.