జక్కన్న ఓ కొత్త దర్శకుడిలా కష్టపడతారు: పృథ్వీరాజ్ సుకుమారన్

Rajamouli works like a debut director says Prithviraj Sukumaran
  • రాజమౌళి తొలి సినిమా తీస్తున్న దర్శకుడిలా కష్టపడతారన్న పృథ్వీరాజ్
  • ఉదయం 7 గంటల షాట్‌కు 5:15కే సెట్స్‌లో ఉంటారని వ్యాఖ్య 
  • ఒకే సీన్‌కు 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలున్నాయని వెల్లడి 
  • మహేశ్ బాబు 'వారణాసి'లో ప్రతినాయకుడిగా పృథ్వీరాజ్
  • రాజమౌళితో పనిచేయడం గొప్ప అనుభవమన్న మలయాళ స్టార్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి పనితీరు, ఆయన అంకితభావం గురించి మలయాళ అగ్ర కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబు కథానాయకుడిగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'వారణాసి'లో పృథ్వీరాజ్ ప్రతినాయకుడు 'కుంభ' పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు కలిసి పనిచేసిన దర్శకులలో రాజమౌళి అత్యంత శ్రమజీవి. తొలి సినిమా అవకాశం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న ఓ నూతన దర్శకుడిలో ఉండే తపన, ఉత్సాహం ఆయనలో కనిపిస్తాయి. ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్సాహంతో, పూర్తి సన్నద్ధతతో ఆయన చిత్రీకరిస్తారు" అని ప్రశంసించారు.

'వారణాసి' సెట్స్‌లోని కఠినమైన పనివేళలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఉదయం 7 గంటలకు చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉంటే, రాజమౌళి తెల్లవారుజామున 5:15 గంటలకే సెట్స్‌కు చేరుకుంటారని, నటీనటులు రాకముందే తన బృందంతో కలిసి పలుమార్లు రిహార్సల్స్ పూర్తి చేస్తారని వెల్లడించారు. భోజన విరామం కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఒక్కోసారి ఆశించిన అవుట్‌పుట్ కోసం ఒకే సన్నివేశానికి 90కి పైగా టేకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని చెప్పారు. నటీనటులకు హావభావాలను వివరించేటప్పుడు రాజమౌళి స్వయంగా నటించి చూపిస్తారని, ఆయనలోని నటుడు అద్భుతమని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా 2027, ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు 'రుద్ర' పాత్రలో, ప్రియాంక చోప్రా జోనాస్ 'మందాకిని' పాత్రలో నటిస్తున్నారు. రాజమౌళితో పనిచేయడం ఒక నటుడిగా, వ్యక్తిగా తనకు గొప్ప అభ్యాస అనుభవాన్ని ఇస్తోందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. 
Go Back to Shorts
SS Rajamouli
Prithviraj Sukumaran
Mahesh Babu
Varanasi Movie
SSMB29
Priyanka Chopra Jonas

More Telugu News