దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు!

Scientists reveal the secret of longevity
  • కొన్ని కుటుంబాల్లో దీర్ఘాయుష్షుకు ఓ ప్రత్యేక జన్యువు కారణమని వెల్లడి
  • సీజీఏఎస్ జన్యువులోని మార్పు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తున్నట్లు గుర్తింపు
  • ఈ జన్యువు ఉన్నవారికి గుండె జబ్బులు, మధుమేహం 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు నిర్ధారణ
  • నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు 212 దీర్ఘాయుష్షు గల కుటుంబాలపై పరిశోధన
కొంతమంది చాలాకాలం పాటు ఆరోగ్యంగా జీవించడానికి గల రహస్యం వారి జన్యువుల్లోనే దాగి ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తున్న ఒక అరుదైన జన్యు మార్పు వారిని దీర్ఘాయుష్షుమంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉంచుతున్నట్లు నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యువు ఉన్నవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు ఇతరులతో పోలిస్తే సగటున 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు తేలింది.

లీడెన్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ పరిశోధకుడు పాస్కల్ పుట్టర్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేసింది. దీర్ఘకాలం జీవించిన తల్లిదండ్రులున్న 212 కుటుంబాల జన్యువులను విశ్లేషించారు. వీరిలో ''సీజీఏఎస్' అనే జన్యువులో ఒక ప్రత్యేకమైన మార్పును కనుగొన్నారు. సాధారణంగా ఈ జన్యువు, కణాల్లోకి వైరస్ వంటివి ప్రవేశించినప్పుడు లేదా కణాలు దెబ్బతిన్నప్పుడు వాపు (ఇన్ ఫ్లమేషన్) ప్రక్రియను ప్రేరేపిస్తుంది. 

అయితే, దీర్ఘాయుష్షు గల కుటుంబాల్లోని వ్యక్తుల్లో ఈ జన్యువు పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా పనిచేస్తోంది. దీనివల్ల అనవసరమైన, దీర్ఘకాలిక వాపు ప్రక్రియ తగ్గుముఖం పడుతోందని, అదే వారి ఆరోగ్య రహస్యమని పరిశోధకులు వివరించారు.

ఈ పాక్షిక పనితీరు వల్ల రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోకుండానే, వయసు పెరిగే కొద్దీ వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తగ్గుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. 

గోథెన్‌బర్గ్‌లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ సదస్సులో ఈ ఫలితాలను వెల్లడించారు. అయితే, ఈ జన్యు మార్పు చాలా అరుదైనదని, కేవలం కొన్ని ప్రత్యేక కుటుంబాల్లోనే కనిపించిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీర్ఘాయుష్షుకు జన్యువులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణం వంటి ఇతర అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని వారు గుర్తుచేశారు.
Go Back to Shorts
Pascal Putter
cGAS gene
Longevity secrets
Leiden University Medical Center
Genetic mutation research
Human longevity study

More Telugu News