మమతా బెనర్జీకి మరో షాక్.. బెంగాల్ సీఎం సువేందును పొగిడిన మహువా మొయిత్రా!

Mahua Moitra praises Bengal CM Suvendu Adhikari another shock for Mamata Banerjee
  • సువేందుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న మహువా మొయిత్రా
  • గతంలో తనకు సువేందు అండగా నిలిచిన సందర్భాలను గుర్తుచేసుకున్న మహువా
  • టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా కలకలం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారిపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. పార్టీలో తిరుగుబాటు, ఎన్నికల్లో ఓటమితో టీఎంసీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో మహువా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహువా మొయిత్రా మాట్లాడుతూ, "సువేందు అధికారితో నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మేమిద్దరం టీఎంసీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే మా మధ్య భావోద్వేగ బంధం ఉంది" అని పేర్కొన్నారు. 2014లో లోక్‌సభ టికెట్ దక్కని సమయంలో తాను తీవ్ర నిరాశకు గురై రాత్రంతా ఏడ్చానని, ఆ సమయంలో సువేందు ధైర్యం చెప్పారని, అలాగే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో తాను కరింపూర్ నుంచి పోటీ చేసినప్పుడు, సీనియర్ నేతలెవరూ రాకపోయినా సువేందు తన తొలి ర్యాలీలో పాల్గొన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలైన విషయం విదితమే. సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగా, మమతా బెనర్జీ సైతం పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల అనంతరం టీఎంసీలో సంక్షోభం మరింత ముదిరింది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం తమకు సుమారు 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించింది. పలువురు ఎంపీలు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు.

అయితే, కాంగ్రెస్‌ పార్టీలో టీఎంసీ విలీనం అవుతుందన్న వార్తల్లోను మహువా మొయిత్రా కొట్టిపారేశారు. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న మహువా, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని కొనియాడటం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది.
Go Back to Shorts
Mahua Moitra
Suvendu Adhikari
Mamata Banerjee
West Bengal Politics
Trinamool Congress
BJP

More Telugu News