జొన్నగిరిలో స్వర్ణ కాంతులు... దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం
- ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం
- ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి లక్ష్యంగా కార్యకలాపాలు
- ఈ గని ద్వారా రాష్ట్రానికి రాయల్టీ రూపంలో ఏటా రూ.144 కోట్ల వరకు ఆదాయం
- ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు
జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (GMSI) సుమారు రూ. 405 కోట్ల పెట్టుబడితో ఈ గనిని అభివృద్ధి చేసింది. 70 ఏళ్ల తర్వాత భారతదేశంలో సమీకృత ప్రాసెసింగ్ యూనిట్‌తో ఏర్పాటైన తొలి ప్రైవేట్ బంగారు గని ఇదే కావడం గమనార్హం. జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయ్ గ్రామాల పరిధిలో 597.82 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఓపెన్-పిట్ గని విస్తరించి ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026-27) ఈ గని నుంచి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రానున్న కాలంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా ఒక టన్ను (1000 కిలోలు)కు పెంచనున్నారు. ఇక్కడ మొత్తం 12 టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 300, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి లభించనుంది.
ఈ గని కార్యకలాపాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో భారీ ఆదాయం అందనుంది. తొలి ఏడాది సుమారు రూ. 57 కోట్లు, పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యాక ఏటా రూ. 144 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా. ఈ ఆదాయంతో పాటు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా స్థానిక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌లో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జొన్నగిరి ప్రాంతానికి 'స్వర్ణగిరి' అని పేరు మార్చాలనే ప్రతిపాదన కూడా ఉంది.
భారత్ ఏటా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు జొన్నగిరి గని ఒక చిన్న ముందడుగుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. హంద్రీనీవా కాలువ నుంచి 18 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా నీటిని సేకరించి, ఇక్కడే బంగారాన్ని శుద్ధి చేసి బంగారు కడ్డీల రూపంలో రిఫైనరీలకు పంపనున్నారు. కేంద్ర ప్రభుత్వ మైనింగ్ సంస్కరణల ఫలితంగా ఈ ప్రాజెక్టు సాకారమైంది.