'జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే!

Anantapur Jagan is the Jagan Sir mentioned in viral Basavatarakam speech
  • బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25 ఏళ్ల వేడుకలు
  • క్యాన్సర్ నుంచి కోలుకున్న యువతి ప్రసంగం వైరల్
  • 'జగన్ సార్' అంటూ ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చ
  • ఆమె చెప్పింది మాజీ సీఎం గురించి కాదు, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ గురించి
  • బాలయ్య చొరవ, జగన్ సహాయంతోనే యువతికి వైద్యం
తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుప‌త్రి ఇటీవల తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్యాన్సర్‌ను జయించిన అనంతపురానికి చెందిన స్వప్న అనే యువతి పంచుకున్న అనుభవాలు అందరినీ కదిలించాయి. 

అయితే, తన ప్రసంగంలో ఆమె 'జగన్ సార్'కు కృతజ్ఞతలు చెప్పడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలామంది వైసీపీ అభిమానులు ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడుతున్నారని భావించి ఆ వీడియోను షేర్ చేశారు. కానీ, అసలు విషయం వేరే ఉంది. ఆమె ప్రస్తావించింది నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, అత్యంత సన్నిహితుడైన అనంతపురం జగన్ అలియాస్ జగదీష్ గురించి. ఈ గందరగోళంతో 'అనంతపురం జగన్' పేరు ఒక్కసారిగా వైరల్ అయింది.

ఎవరీ 'అనంతపురం జగన్'?
ఈ ఘటనతో అసలు ఎవరీ 'అనంతపురం జగన్', బాలకృష్ణకు ఆయనెలా అంత దగ్గరయ్యారని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. జగదీష్ అలియాస్ అనంతపురం జగన్, నందమూరి బాలకృష్ణకు కేవలం అభిమాని మాత్రమే కాదు, ఆయనకు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి. బాలయ్య ఏ కార్యక్రమానికి వెళ్లినా జగన్ ఆయన వెంటే ఉంటారు. తన తండ్రి 2004లో మరణించగా, ఆ స్థానంలో బాలకృష్ణే తన కుటుంబానికి అండగా నిలిచారని జగన్ పలు సందర్భాల్లో ఉద్వేగంగా చెప్పారు. బాలకృష్ణను ఆయన కేవలం అభిమాన నటుడిగానే కాకుండా, ఒక తండ్రిలా, గురువులా భావిస్తారు.

బాలకృష్ణ స్ఫూర్తితోనే 'NBK Helping Hands' అనే సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలయ్యకు ఫ్యాన్స్ ఉండరు, భక్తులు ఉంటారని చెప్పే జగన్, ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రతి ఏటా బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా 'భోళా బాలయ్య' పేరుతో ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేసి జూన్ 1 నుంచి 10 వరకు వేడుకలు జరిపారు. బాలయ్య అభిమానుల్లో 'అనంతపురం జగన్‌'కు విశేషమైన ఆదరణ ఉంది.

స్వప్నకు పునర్జన్మ ప్రసాదించిన వైనం
అనంతపురానికి చెందిన స్వప్న పదో తరగతి చదువుతున్నప్పుడు అరుదైన బోన్ క్యాన్సర్ బారిన పడింది. ఆమె కుటుంబం ఎన్నో ఆసుత్రులకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న 'అనంతపురం జగన్', వెంటనే స్వప్న ఇంటికి వెళ్లి ఆమె పరిస్థితిని చూసి చలించిపోయారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన బాలకృష్ణ, స్వప్నను బసవతారకం క్యాన్సర్ ఆసుప‌త్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చూశారు. ఆమె చికిత్సను స్వయంగా పర్యవేక్షించారు.

ఆసుప‌త్రి వైద్యులు, బాలకృష్ణ, 'అనంతపురం జగన్' అందించిన ధైర్యంతో స్వప్న ప్రాణాంతక క్యాన్సర్‌ను జయించింది. తనకు పునర్జన్మనిచ్చిన బసవతారకం ఆసుప‌త్రిని దేవాలయంగా అభివర్ణిస్తూ, బాలకృష్ణకు, తనకు అండగా నిలిచిన 'జగన్ సార్'కు ఆమె వేదికపైనే కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఒక్క సంఘటనతో బసవతారకం ఆసుప‌త్రి అందిస్తున్న అమూల్యమైన సేవలతో పాటు బాలకృష్ణ సేవాగుణం, ఆయన స్ఫూర్తితో ఒక అభిమాని చేస్తున్న నిస్వార్థ సేవ కూడా వెలుగులోకి వచ్చాయి.
Anantapur Jagan
Nandamuri Balakrishna
Basavatarakam Cancer Hospital
NBK Helping Hands
Jagan Sir viral speech
Cancer survivor Swapna

More Telugu News