140 కోట్ల బ్యారెళ్ల నిల్వలున్నా తప్పని తిప్పలు.. చైనా ఇంధన భద్రతకు హెచ్చరికగా హర్మూజ్ సంక్షోభం!

  • అమెరికా-ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
  • చైనా ఇంధన సరఫరాకు తాత్కాలికంగా తొలగిన ఆటంకాలు
  • చైనా ముడి చమురు దిగుమతుల్లో సగం హర్మూజ్ జలసంధి నుంచే
  • భారీ చమురు నిల్వలు, రష్యా దిగుమతులతో నెట్టుకొస్తున్న డ్రాగన్
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం.. ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును దిగుమతి చేసుకునే చైనాకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, తదుపరి చర్చల కోసం 60 రోజుల గడువు ఇవ్వడం వల్ల చైనాకు ఇంధన సరఫరా ఇబ్బందులు తాత్కాలికంగా తొలిగాయి. అయినప్పటికీ, ఈ అంతర్జాతీయ వివాదం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ భారీ ముప్పును ఎదుర్కుంటోందని, ఈ యుద్ధం కారణంగా డ్రాగన్ కంట్రీ ఆర్థికంగా నష్టపోయిన దేశాల జాబితాలోకి జారుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధం కారణంగా హర్మూజ్ జలసంధి మూసివేత వల్ల చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎన్ఎన్‌జీ) రవాణా పూర్తిగా స్తంభించింది. చైనా వార్షిక ముడి చమురు దిగుమతుల్లో, ఇంధన సరఫరాలో దాదాపు సగం వాటా ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. చైనా తన వ్యూహాత్మక నిల్వలను ఉపయోగించి స్వల్పకాలిక నష్టాలను తగ్గించుకున్నప్పటికీ, ఉత్పాదక రంగంపై ఆధారపడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ ఉద్రిక్తతలు పెద్ద సవాలుగా మారాయి.

చైనాపై పడిన ప్రభావం ఎంత?
చైనా తన ముడి చమురులో దాదాపు 50 శాతాన్ని హర్మూజ్ జలసంధి ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. దీని మూసివేత వల్ల చైనాలోని రవాణా, పెట్రోకెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎగుమతి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చైనా వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఇప్పటికే దేశీయంగా వినియోగదారుల నమ్మకం తగ్గడం, రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు అదనపు భారంగా మారాయి.

అయితే, ఈ సంక్షోభాన్ని చైనా కొంతవరకు తట్టుకోగలిగింది. చైనా వద్ద దాదాపు 1.2 నుండి 1.4 బిలియన్ బ్యారెళ్ల వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ఆ దేశానికి నాలుగు నెలల పాటు సరిపోతాయి. వీటితో పాటు రష్యా నుండి చమురు దిగుమతులను పెంచడం, దేశీయ బొగ్గు నిల్వలు, పునరుత్పాదక ఇంధనంపై ఆధారపడటం వల్ల చైనా తక్షణ ప్రమాదం నుండి బయటపడింది.

60 రోజుల గడువు - భవిష్యత్తు వ్యూహం
జూన్ మధ్యలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వల్ల రవాణా రంగానికి స్థిరత్వం లభించింది. ఇరాన్ అణు కార్యక్రమం సహా పలు వివాదాస్పద అంశాలను పరిష్కరించడానికి ఈ 60 రోజుల సమయం అత్యంత కీలకంగా మారింది. జపాన్ లేదా దక్షిణ కొరియా వంటి ఇతర చమురు దిగుమతి దేశాలతో పోలిస్తే చైనా ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ, ఒకే సముద్ర రవాణా మార్గంపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో డ్రాగన్ దేశానికి అర్థమైంది.

దీంతో రష్యా, మధ్య ఆసియా దేశాల నుండి భూమార్గం ద్వారా వచ్చే పైప్‌లైన్లను విస్తరించడం, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ను పెంచడం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని వేగవంతం చేయడంపై చైనా ఇప్పుడు మరింతగా దృష్టి సారిస్తోంది. ఇండస్ట్రియల్ వృద్ధి, ఇంధన భద్రత సాధించాలనే చైనా ఆశయాలకు ఈ అంతర్జాతీయ అస్థిరత ఒక హెచ్చరికగా మారింది.

China
Strait of Hormuz
Energy Security
Crude Oil Imports
US Iran Conflict
Strategic Oil Reserves

More Telugu News