Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అప్పట్లో మోడీని ఆకాశానికెత్తిన నితీశ్ కుమార్

ఇటీవల కాలంలో నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న జనతాదళ్ (యూ) నేత, బీహార్ సీఏం నితీశ్ కుమార్.. ఒకప్పుడా గుజరాత్ ముఖ్యమంత్రిని వేనోళ్ళ కీర్తించినవాడే. తాము బీజేపీతో 17 ఏళ్ళ బంధానికి గుడ్ బై చెప్పడానికి మోడీయే కారణమని పరోక్షంగా చెబుతున్న నితీశ్.. 2003లో ఆయన్ని ఆకాశానికెత్తేశాడు.

మోడీ వంటి నాయకుడు మరెక్కడా ఉండరన్న స్థాయిలో.. ఆయన గుజరాత్ కే పరిమితం కారాదని, దేశానికి ఆయన సేవలు అవసరమని తీర్మానించాడు. అప్పట్లో జరిగిన ఓ బహిరంగ సభలో నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. నిన్న బీహార్లో బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో నితీశ్ గతంలో మాట్లాడిన దృశ్యాలున్న వీడియోను బీజేపీ నేడు మీడియాకు విడుదల చేసింది. దీనిపై నితీశ్ వివరణ ఇవ్వక తప్పలేదు.

తాను అప్పుడు అటల్ బిహారీ వాజ్ పేయి క్యాబినెట్లో రైల్వే మంత్రిగా వ్యవహరిస్తున్నానని చెబుతూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ప్రొటోకాల్ ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని పొగడాల్సి వచ్చిందని వివరించారు. అలాంటప్పుడు స్వంత అజెండా అనుసరించలేమని పేర్కొన్నారు.

More Telugu News