ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకున్నానో.. ఆ కల ఇప్పుడు నెరవేరింది: వైభవ్ సూర్యవంశీ

  • 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపికైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ
  • సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన యువ క్రికెటర్
  • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడల జట్టులో చోటు
  • టీమిండియా జెర్సీ చూసి మాటల్లో చెప్పలేని ఆనందం కలిగిందన్న వైభవ్
  • త‌న‌ కల నెరవేరిందంటూ యువ బ్యాటింగ్ కెరటం భావోద్వేగం
భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం నమోదైంది. కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే యువ బ్యాటింగ్ కెరటం వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికై చరిత్ర సృష్టించాడు. ఈ ఎంపికతో 36 ఏళ్ల క్రితం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు 2026 ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్టులో వైభవ్‌కు చోటు దక్కింది.

1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో భారత జట్టులోకి అరంగేట్రం చేసి, అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు వైభవ్, అంతకంటే తక్కువ వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై ఆ రికార్డును అధిగమించాడు. రాబోయే పర్యటనల్లో అతను తుది జట్టులో ఆడితే, భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా మరో అరుదైన ఘనత సాధిస్తాడు.

ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది..
భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా బీసీసీఐ పంచుకున్న వీడియోలో వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి గురయ్యాడు. టీమిండియా జెర్సీని అందుకున్న క్షణాలను వివరిస్తూ.. "ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఏ కలతో అయితే నేను బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టానో, ఆ కల ఇప్పుడు నెరవేరింది. నా జీవిత ప్రయాణంలో అతి పెద్ద అడుగు ఈ రోజే పూర్తయింది. ఆ టీషర్ట్‌ను చూసినప్పుడు కలలో ఉన్నట్లు అనిపించింది. ఆగకుండా నవ్వుతూనే ఉన్నాను. కొన్నిసార్లు మనం ఊహించనివి జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా తెలియదు. నాకు సరిగ్గా అలాగే అనిపించింది" అని తన ఆనందాన్ని పంచుకున్నాడు.

భారత జట్టు షెడ్యూల్ ప్రకారం.. జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఆ తర్వాత జులై 1 నుంచి 11 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు ఆడనుంది. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.

Vaibhav Suryavanshi
Indian T20 Team
Sachin Tendulkar Record
Youngest Indian Cricketer
BCCI Selection
2026 Asian Games

More Telugu News