పురుషుల్లో మద్యపానం, మహిళల్లో స్మోకింగ్.. ఆరోగ్య సర్వేలో ఆందోళనకర విషయాలు

  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో కీలక విషయాలు వెల్లడి
  • దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పురుషుల మద్యపానం పెరుగుదల
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెరిగిన పురుషుల మద్యం వినియోగం
  • 13 రాష్ట్రాల్లో మహిళల్లో పొగాకు వాడకం అధికం
దేశంలో ప్రజారోగ్య ముఖచిత్రంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 (ఎన్ఎఫ్‌హెచ్ఎస్-6, 2023-24) ఆందోళనకర గణాంకాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా పురుషుల్లో మద్యపానం, పలు రాష్ట్రాల్లో మహిళల్లో పొగాకు వినియోగం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పురుషుల మద్యం వినియోగం పెరగడం గమనార్హం.

జాతీయ స్థాయిలో 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో మద్యపాన అలవాటు ఉన్నవారి సంఖ్య 18.7 శాతం నుంచి 18.9 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో సైతం పురుషుల మద్యం వినియోగం 15.4 శాతం నుంచి 16.5 శాతానికి పెరగడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాతం 23.1 నుంచి 23.3కు, తెలంగాణలో 43.4 నుంచి 43.9 శాతానికి చేరింది.

దేశవ్యాప్తంగా మహిళల్లో మద్యపానం అలవాటు 1.3 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో (0.5 నుంచి 0.6 శాతం), తెలంగాణలో (6.7 నుంచి 7.1 శాతం) మహిళా మద్యపాన ప్రియుల సంఖ్య పెరిగింది. గుజరాత్‌లో మహిళలు, పురుషుల్లో మద్యం సేవించే వారి సగటు 5.8 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా మహిళల్లో పొగాకు వినియోగం 8.9 శాతం నుంచి 8.4 శాతానికి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 13 రాష్ట్రాల్లో మహిళలు పొగాకును ఎక్కువగా వినియోగిస్తున్నట్లు నివేదిక తేలింది. పురుషుల్లో పొగాకు వినియోగం 38 శాతం నుంచి 36.3 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల పొగాకు, మద్యం వాడకం ఎక్కువగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది.

ఈ గణాంకాలపై ఐసీఎంఆర్-ఎన్‌ఐసీపీఆర్ డైరెక్టర్ డాక్టర్ షాలిని సింగ్ స్పందించారు. "జాతీయ సగటులు సంతృప్తికరంగా ఉన్నట్లు అనిపించినా, పలు రాష్ట్రాల్లో సమస్య తీవ్రంగా ఉంది. అందువల్ల ప్రతి రాష్ట్రం, జిల్లాకు ప్రత్యేకమైన కార్యాచరణ అవసరం" అని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గర్భిణుల్లో పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో కౌన్సెలింగ్ సేవలను విస్తృతం చేయాలని ఆమె సూచించారు. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి అసంక్రమిత వ్యాధులు పెరగడానికి ఈ వ్యసనాలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



NFHS 6
National Family Health Survey
Alcohol Consumption India
Telangana Health Statistics
Andhra Pradesh Health Survey

More Telugu News