అమెరికా-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. భారీగా పతనమైన ముడిచమురు ధరలు

Crude oil prices fall sharply due to US Iran talks effect
  • 3 శాతం వరకు పడిపోయిన అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్
  • బ్యారెల్ 79 డాలర్ల స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడ్
  • భారత్ వంటి దేశాలకు తగ్గనున్న దిగుమతుల భారం, ద్రవ్యోల్బణం
  • చమురు ధరల పతనంతో లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు సోమవారం భారీగా పతనమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చలు ముగియడంతో చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో ధరలు 3 శాతం వరకు క్షీణించాయి.

వివరాల్లోకి వెళ్తే, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2 శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు 79 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ట్రేడింగ్ ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 82 డాలర్ల పైకి చేరినప్పటికీ, చర్చల వార్తలతో వెంటనే దిగివచ్చింది. అదేవిధంగా  అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డ‌బ్ల్యూటీఐ) క్రూడ్ ధర 3శాతం తగ్గి బ్యారెల్‌కు 75 డాలర్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, బలహీనంగా ఉన్న కాల్పుల విరమణను పొడిగించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ సీనియర్ అధికారులు చర్చలు జరిపినట్లు వచ్చిన నివేదికలు ఈ పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి.

ఇప్పటికే గత వారం కూడా ముడి చమురు ధరలు 8శాతానికి పైగా తగ్గాయి. గల్ఫ్‌లో నిలిచిపోయిన నౌకలను తిరిగి అనుమతించవచ్చని, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. తమ దేశం నుంచి చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులకు మినహాయింపులు లభించాయని, స్తంభింపజేసిన కొన్ని ఆస్తులను తిరిగి పొందేందుకు మార్గం సుగమమైందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చీ ప్రకటించడం ఈ అంచనాలకు మరింత బలం చేకూర్చింది.

పశ్చిమాసియాలో అనిశ్చితి ఉన్నప్పటికీ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన ఉండటం, మార్కెట్లు పెద్దస్థాయిలో ఘర్షణలను ఊహించడం లేదనడానికి సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, స్విట్జర్లాండ్‌ చర్చల నుంచి ఇరాన్ వైదొలిగిందనే కొన్ని నివేదికల నేపథ్యంలో ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించిందని, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు, ముడి చమురు ధరలు తగ్గడం ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. సోమవారం ఉదయం దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ ధరల తగ్గుదల భారత్ వంటి ప్రధాన చమురు దిగుమతి దేశాలకు పెద్ద ఊరటనివ్వనుంది. దిగుమతి ఖర్చులు, ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటుపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Crude Oil
US Iran talks
Brent crude price
WTI oil market
Iran oil exports
Global energy prices

More Telugu News