ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా కదిలేది లేదు: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు పట్టు
- జంతర్ మంతర్ వద్ద సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన
- అనుమతి ముగిసినా కదిలేది లేదంటున్న ఆందోళనకారులు
ఈ ఆందోళనలో విద్యార్థులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లేట్లు, స్పూన్లతో శబ్దం చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ శాంతియుత నిరసనను కొనసాగించేందుకు అనుమతిని పొడిగించాలని దీప్కే అధికారులను కోరారు. విద్యావ్యవస్థలో జరుగుతున్న వరుస తప్పిదాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతున్నా, ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా పదవిలో కొనసాగడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
శనివారం సాయంత్రంతో నిరసన గడువు ముగియడంతో పోలీసులు జంతర్ మంతర్‌ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే, తమ ఆందోళనను శాంతియుత మార్గంలోనే కొనసాగిస్తామని దీప్కేతో పాటు ఆయన మద్దతుదారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీజేపీ హెచ్చరించింది.
మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కావడంతో, మే 12న ఆ పరీక్షను అధికారులు రద్దు చేశారు. తిరిగి ఈ పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నారు. ఈ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారు. పరీక్ష రద్దు, అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం.