చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!
- లింగంగుంట్ల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
- చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి
- అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ
- రాష్ట్రంలోని 44,346 అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం
- ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
ముఖ్యమంత్రి రాక సందర్భంగా అంగన్వాడీ కేంద్రం టీచర్, సహాయకురాలు ఆయనకు స్వాగతం పలికారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'నెట్ జీరో' విధానంలో భాగంగా, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాలుష్యరహితంగా మార్చే కార్యక్రమానికి సీఎం ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.32 కోట్ల వ్యయంతో 44,346 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు, స్టీల్ పాత్రలను పంపిణీ చేసే బృహత్తర పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా లింగంగుంట్ల అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్, కొత్త పాత్రలను స్వయంగా అందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం, అంగన్వాడీ సహాయకురాలు కొత్త ఇండక్షన్ స్టవ్‌పై సీఎం సమక్షంలోనే రాగి జావ తయారు చేశారు. చంద్రబాబు చిన్నారులతో కలిసి కింద కూర్చుని ఆ జావను స్వీకరించారు. ఆయన చర్య అక్కడున్న వారిని ఆకట్టుకుంది. పర్యటనలో భాగంగా పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూ అంగన్వాడీ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్క నాటారు.
అన్నదాతలకు అండగా.. ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'అన్నదాత సుఖీభవ' కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మొదటి విడత ఆర్థిక సాయాన్ని ఆయన బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.3,125 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని రైతులతో ముఖాముఖి నిర్వహించి, ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగవుతున్న పంటల వివరాలు, రైతుల అనుభవాలను అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


