బాలుడి ప్రాణం కాపాడేందుకు బండ్ల గణేశ్ 5 లక్షల సాయం.. పవన్ కల్యాణ్ స్ఫూర్తితోనేనంటూ భావోద్వేగం!

Bandla Ganesh donates 5 lakhs to save boy life inspired by Pawan Kalyan
  • ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్
  • ఇటీవలే నిరంజన్ ను కలిసి.. కుటుంబానికి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్
  • నారా భువనేశ్వరి పుట్టినరోజున సాయం చేయడం సంతోషంగా ఉందన్న బండ్ల

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తనలోని ఉదారత్వాన్ని చాటుకుంటూ ఒక గొప్ప నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న హనుమకొండకు చెందిన చిన్నారి నిరంజన్ కుటుంబానికి తాను ప్రకటించిన రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని ఈరోజు తన చేతుల మీదుగా అందజేశారు.


హనుమకొండలోని హనుమాన్ నగర్‌లో ఉన్న చిన్నారి నిరంజన్ నివాసానికి బండ్ల గణేశ్ స్వయంగా వెళ్లారు. నిరంజన్‌తో కాసేపు ముచ్చటించి, ధైర్యం చెప్పారు. అతని ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలతో మాట్లాడి... తమ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ తరఫున రూ. 5 లక్షల చెక్‌ను వారికి అందజేశారు. ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.


ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మీడియాతో మాట్లాడుతూ... "నేను పవన్ కల్యాణ్ గారి భక్తుడిని. దైవసమానులైన పవన్ కల్యాణ్ గారు ఈ బాబును పరామర్శించినప్పుడే నిరంజన్ విషయం నా దృష్టికి వచ్చింది. ఆయన స్ఫూర్తితోనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం చేశాను. నిజానికి మేమంతా ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి పవన్ కల్యాణ్ గారి దయే కారణం" అంటూ తన ‘బాస్’పై ఉన్న భక్తిని చాటుకున్నారు.


ప్రస్తుతం తన కూతురి వివాహ పనులతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ రోజే వచ్చి సాయం చేయాలని ఫిక్స్ అయినట్లు బండ్ల గణేశ్ చెప్పారు. "నారా భువనేశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ రూ. 5 లక్షల సాయాన్ని నిరంజన్ కుటుంబానికి అందించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. బాబు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన సందర్భంగా నేను ఎలాంటి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు" అని స్పష్టం చేశారు.

Go Back to Shorts
Bandla Ganesh
Pawan Kalyan
Hanumakonda
Financial Aid
Niranjan
Parameswara Art Productions

More Telugu News