హైదరాబాద్ మల్టీప్లెక్స్‌ల్లో ఫుడ్ సేఫ్టీ దాడులు... ఎక్కడ ఏం గుర్తించారంటే?
- హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు
- రెస్టారెంట్లతో పోలిస్తే సినిమా హాళ్లలో పరిస్థితి మెరుగ్గా ఉందని వెల్లడి
- కొన్నిచోట్ల గడువు ముగిసిన పదార్థాలు, నిల్వలో లోపాలు గుర్తింపు
- పెద్దఎత్తున పురుగులు, అపరిశుభ్రత వంటి సమస్యలు లేవన్న అధికారులు
- లోపాలున్న చోట సిబ్బందికి సూచనలు
ఇన్ఆర్బిట్ మాల్‌లోని పీవీఆర్ ఐనాక్స్, లులూ మాల్‌లోని సినీపోలిస్, జీఎస్‌ఎం మాల్‌లోని ఐనాక్స్ ఫుడ్ అవుట్‌లెట్లలో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కొన్ని స్వల్ప లోపాలను గుర్తించినప్పటికీ, సాధారణ రెస్టారెంట్లలో కనిపించినట్లుగా పురుగులు ఉనికి లేదా తీవ్రమైన అపరిశుభ్రత వంటి పరిస్థితులు లేవని అధికారులు స్పష్టం చేశారు.
ఇన్ఆర్బిట్ మాల్‌లోని పీవీఆర్ ఐనాక్స్‌లో గడువు ముగిసిన సేవ్‌తో పాటు పాడైపోయిన కాలీఫ్లవర్‌ను గుర్తించిన అధికారులు వాటిని వెంటనే ధ్వంసం చేయించారు. వండిన చికెన్ టిక్కాను ఫ్రీజర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడం, కొన్ని ఆహార పదార్థాలపై లేబుల్స్ లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అయినప్పటికీ, సిబ్బంది హెయిర్‌నెట్‌లు, ఆప్రన్లు ధరించడం వంటి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
లులూ మాల్‌లోని సినీపోలిస్‌లో డస్ట్‌బిన్‌లకు మూతలు లేకపోవడం, ఫ్రీజర్‌లో ఉడికించిన పాస్తాను నిల్వ ఉంచడం వంటి చిన్నపాటి లోపాలు మినహా మిగిలిన ప్రమాణాలు బాగున్నాయని అధికారులు తెలిపారు. జీఎస్‌ఎం మాల్‌లోని ఐనాక్స్‌లో బర్గర్ బన్స్, చికెన్ టిక్కాకు సరైన లేబులింగ్ లేకపోవడం, నీటి నాణ్యత పరీక్షా నివేదికలు ఆందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
ఇటీవల గచ్చిబౌలి, మదీనగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లపై జరిగిన తనిఖీల్లో బొద్దింకలు, నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారం, బూజు పట్టిన పదార్థాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఆయా రెస్టారెంట్లతో పోలిస్తే మల్టీప్లెక్స్‌లలోని ఫుడ్ కోర్టులు మెరుగైన ప్రమాణాలను పాటిస్తుండటం సిని ప్రేక్షకులకు కొంత ఊరటనిచ్చే పరిణామం.