పాకిస్థాన్‌లో బాలల బతుకు ఛిద్రం.. ప్రమాదకర పనుల్లో 66 లక్షల మంది చిన్నారులు

  • పాకిస్థాన్‌లో 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారని వెల్లడి
  • పంజాబ్ ప్రావిన్స్‌లో బాల కార్మికులుగా అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు 
  • దాదాపు 30 ఏళ్ల తర్వాత బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన జాతీయ నివేదిక
  • పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యతే ప్రధాన కారణాలని సర్వేలో స్పష్టీక‌ర‌ణ‌
  • చట్టాల అమలు వైఫల్యంతో సమస్య తీవ్రమవుతోందని సామాజిక కార్యకర్తల ఆందోళన
పాకిస్థాన్‌లో బాల కార్మిక వ్యవస్థ అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏకంగా 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా మగ్గుతుండగా, వారిలో 66 లక్షల మంది ఆరోగ్యం, భద్రత, భవిష్యత్తుకు ముప్పు కలిగించే ప్రమాదకర పనుల్లో ఉన్నారని తేలింది. పాకిస్థాన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌సీహెచ్ఆర్‌), ఐక్యరాజ్యసమితి చిన్నారుల నిధి (యునిసెఫ్) సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించి నివేదికను విడుదల చేశాయి.

'పాకిస్థాన్: చైల్డ్ లేబర్ సర్వేస్, ఎవిడెన్స్ ఫర్ యాక్షన్' పేరుతో విడుదలైన ఈ నివేదిక, దాదాపు 30 ఏళ్లలో ఆ దేశంలో బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన తొలి సమగ్రమైన, జాతీయస్థాయి నివేదిక కావడం గమనార్హం. స్థానిక మీడియా సంస్థ 'డాన్' కథనం ప్రకారం.. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రమాదకర బాల కార్మిక వ్యవస్థ విస్తరించి ఉందని ఎన్‌సీహెచ్ఆర్‌ చైర్‌పర్సన్ రబియా జవేరి ఆఘా తెలిపారు. నివేదిక ప్రకారం పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు బాల కార్మికులుగా ఉండగా.. సింధ్‌లో 16 లక్షలు, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 7.45 లక్షలు, బలూచిస్థాన్‌లో 2 లక్షలకు పైగా చిన్నారులు వెట్టిచాకిరిలో మగ్గుతున్నారు.

చిన్నారులు బాల కార్మికులుగా మారడానికి పేదరికమే ప్రధాన కారణమని ఈ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉన్నచోట ఈ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. బాలికలతో పోలిస్తే బాలురే ఎక్కువ సంఖ్యలో, ముఖ్యంగా ప్రమాదకరమైన పనుల్లోకి వెళుతున్నారని తేలింది. ఈ వ్యవస్థ చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పనిలో ఉన్న పిల్లలు బడికి దూరమవడమే కాకుండా, ఎక్కువ గంటలు పనిచేయడం, తరచూ గాయాల బారిన పడటం, అనారోగ్యంతో బాధపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రావిన్సుల్లో పనిచేస్తున్న చిన్నారుల్లో 32 శాతం నుంచి 58 శాతం వరకు పని సంబంధిత గాయాలు లేదా అనారోగ్యాలతో బాధపడుతున్నట్లు తేలింది. అంతేగాక‌ పనిలో ఉన్న పెద్ద పిల్లల్లో మూడింట ఒక వంతు మంది డిప్రెషన్ లక్షణాలతో బాధపడుతున్నారని నివేదిక హెచ్చరించింది.

మరోవైపు బాల కార్మిక నిర్మూలన చట్టాలు ఉన్నప్పటికీ, వాటి అమలు తీరు సంతృప్తికరంగా లేదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం 'సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్' (ఎస్‌పీఏఆర్‌సీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆసియా ఆరిఫ్ మాట్లాడుతూ.. ఒక్క ఇస్లామాబాద్‌లోనే ప్రతి నాలుగో ఇంట్లో ఒక బాల కార్మికుడు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరఫరా చైన్‌లు, హోటళ్లు, ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లు, ఇటుక బట్టీల వంటి పరిశ్రమల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని ఆమె గుర్తుచేశారు. చట్టాలను కఠినంగా అమలు చేయడం, సామాజిక భద్రత కల్పించడం, నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలమని సూచించారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం 2.62 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారని ఆ దేశ విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో బాల కార్మిక సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Pakistan
Child Labor
UNICEF Report
NCHR Pakistan
Hazardous Child Labor
Child Rights

More Telugu News