రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి

  • బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి
  • కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య
  • ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు 

తెలంగాణలో రైతు సమస్యలను అధికార కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తే... ప్రజలు ఈ కాంగ్రెస్ నాయకులనే కనుమరుగు చేస్తారని అన్నారు.


రాష్ట్రంలో వివిధ కారణాలతో దాదాపు 7,600 మంది రైతులు మరణిస్తే... వారికి అందాల్సిన రైతు బీమా డబ్బులు ఇప్పటివరకు రాలేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్‌ఐసీకి ఇన్స్యూరెన్స్ ప్రీమియం సకాలంలో చెల్లించకపోవడం వల్లే ఈ క్లెయిమ్స్ ఆగిపోయాయనే వార్తలు వస్తున్నాయన్నారు. ఇది కేసీఆర్ తీసుకొచ్చిన పథకం కాబట్టే... దీనిని ఎలాగైనా మూలనపడేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. చేతనైతే కొత్త పథకాలు తేవాలి తప్ప, ఉన్న పథకాలను చెడగొట్టవద్దని హితవు పలికారు.


మొత్తం 33 రకాల వడ్లు ఉంటే.. ప్రభుత్వం కేవలం 7 రకాల వడ్లను మాత్రమే బోనస్‌కు గుర్తిస్తోందన్నారు. అయితే ఈ 7 రకాల వడ్లు సాగు చేస్తే ఎకరానికి కేవలం 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుందని, అదే మిగతా 26 రకాల వడ్లు వేస్తే ఎకరానికి ఏకంగా 30 క్వింటాళ్ల పంట పండుతుందని చెప్పారు. ప్రభుత్వం చెప్పిన ఆ 7 రకాల వడ్లు పండించడం వల్ల రైతులు ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి నష్టపోతారని... అంటే ఒక్కో రైతు ఎకరానికి దాదాపు రూ. 24 వేల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.


Jeevan Reddy
Rythu Bima
Telangana Farmer Insurance
BRS Party
Paddy Bonus
Revanth Reddy

More Telugu News