‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం
- 'హార్టిన్' సినిమాతో హీరోగా మారిన సనంత్ రెడ్డి
- తనను కేవలం సనంత్ అని పిలిస్తే చాలని విన్నపం
- ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హార్టిన్'
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు, పేర్ల మార్పులు చాలా కామన్. కానీ ఒక యంగ్ హీరో మాత్రం తన పేరు చివర ఉన్న కులం పేరును తీసేస్తూ తీసుకున్న బోల్డ్ నిర్ణయం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘డిమాంటి కాలనీ’, ‘పేట’, ‘మహాన్’ వంటి క్రేజీ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సనంత్.. ఇప్పుడు హీరోగా మారారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘హార్టిన్’ (Heartin) ప్రమోషన్స్ వేదికగా ఆయన మీడియాకు ఒక వినూత్న విజ్ఞప్తి చేశారు
చెన్నైలో జరిగిన ‘హార్టిన్’ ఆడియో, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సనంత్ మాట్లాడుతూ... ఇకపై తనను పూర్తి పేరు ‘సనంత్ రెడ్డి’ అని పిలవొద్దని, మీడియాలో కూడా ఎక్కడా అలా రాయొద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం ‘సనంత్’ అని పిలిస్తే చాలని స్పష్టం చేశారు. సాధారణంగా ఇతర భాషా చిత్ర పరిశ్రమల్లో నటీనటులు తమ పేర్ల పక్కన కులం పేరు (సర్నేమ్) జోడించడం కామన్. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో ఇలా పేరు పక్కన కులం పేరును పెట్టుకునే సంప్రదాయం లేదు. అందుకే తమిళ సంప్రదాయాన్ని గౌరవిస్తూ తన పేరులోని ‘రెడ్డి’ అనే పదాన్ని తొలగించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా విషయానికి వస్తే... ఇదొక ఇంట్రెస్టింగ్ ముక్కోణపు ప్రేమకథా చిత్రం. జైపూర్, చెన్నై, ఊటీ వంటి అందమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. సనంత్ సరసన మడొన్నా సెబాస్టియన్, ఇమయ హీరోయిన్లుగా నటించగా... వాట్సాప్ మణి, డెబ్ నితకర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. కిషోర్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ‘ప్రేమమ్’, ‘నేరమ్’ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రాజేష్ మురుగేశన్ దీనికి సంగీతం సమకూర్చారు. స్టెప్ వన్ స్టూడియోస్‌తో కలిసి ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలోకి రానుంది.