ఐఫోన్ కొనాలనుకునేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలో పెరగనున్న ధరలు..!

  • ఐఫోన్‌, మ్యాక్‌, ఐప్యాడ్‌ ధరలు పెరిగే సంకేతాలు
  • ధరల పెంపు తప్పదని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ వ్యాఖ్య
  • ఏఐ రంగం వల్ల మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు భారీ డిమాండ్‌
  • చిప్‌ల కొరతతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందన్న యాపిల్‌
  • ముందుగా మ్యాక్‌, ఐప్యాడ్‌లపై ప్రభావం ఉండొచ్చని అంచనా
యాపిల్‌ ఉత్పత్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి త్వరలో షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ ధరలు పెంచక తప్పదని యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ సంకేతాలు ఇచ్చారు. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ కారణంగా మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ల ధరలు భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపారు.

ఇటీవలి కాలంలో పలు స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు ధరలు పెంచినా యాపిల్‌ మాత్రం ఇప్పటివరకు వినియోగదారులపై భారం మోపలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు. పెరుగుతున్న వ్యయాన్ని కంపెనీ భరించే స్థితిలో ఇకలేదని చెప్పారు. వినియోగదారులపై ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నించినా అది ఎక్కువ కాలం సాధ్యం కాదని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. భారీ డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల కోసం టెక్‌ సంస్థలు పెద్దఎత్తున మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లను కొనుగోలు చేస్తున్నాయి. దీంతో ఈ చిప్‌లకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. సరఫరా తగ్గిపోవడంతో ధరలు కూడా ఎగబాకుతున్నాయి. ముఖ్యంగా డీఆర్‌ఏఎం మెమరీ మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి కనిపిస్తోందని కుక్‌ వివరించారు.

ధరలు ఎప్పుడు పెరుగుతాయి? ఏ ఉత్పత్తులపై పెరుగుతాయి? అనే విషయాలపై యాపిల్‌ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే మ్యాక్‌లు, ఐప్యాడ్‌లపై ముందుగా ప్రభావం కనిపించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల మ్యాక్‌ మినీ ప్రారంభ ధరను పెంచడం కూడా ఇదే దిశగా సంకేతంగా చెబుతున్నారు.

ఈ ఏడాది సెప్టెంబరులో ఐఫోన్‌ 18 సిరీస్‌ను యాపిల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అదే సమయంలో కంపెనీ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా పరిచయం చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది. చిప్‌ల ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే కొత్త ఐఫోన్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా కొత్త ఐఫోన్‌ విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండొచ్చని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పాత మోడళ్లపై భారీ తగ్గింపులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని టిమ్‌ కుక్‌ అసాధారణంగా అభివర్ణించారు. టెక్నాలజీ రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

Apple
Tim Cook
iPhone price hike
AI chip demand
Apple iPad Mac
Memory storage cost

More Telugu News