నోరు విప్పితే కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తా.. బాలికను బంధించి నగల వ్యాపారి పదేపదే అత్యాచారం!

Ashok Kumar Rastogi Kanpur Jeweler Arrested For Repeatedly Raping Minor Girl
  • మైనర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కాన్పూర్ జ్యువెలర్ అరెస్ట్
  • స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అఘాయిత్యం
  • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • నిందితుడికి గతంలోనూ ఇలాంటి నేరచరిత్ర ఉన్నట్లు వెల్లడి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక ప్రముఖ బంగారు నగల దుకాణాల యజమాని.. తన వద్ద పనిచేస్తున్న 15 ఏళ్ల బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అశోక జ్యువెలర్స్ అధినేత అశోక్ కుమార్ రస్తోగి.. సదరు బాలికకు స్కూటర్ నేర్పిస్తాననే నెపంతో తన ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి, అక్కడ బంధించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో - POCSO)తో పాటు పలు కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, జైలుకు తరలించారు.

కాన్పూర్‌లో పలు బంగారు నగల దుకాణాలు ఉన్న రస్తోగి.. మే నెల మొదట్లో దర్సన్‌పుర్వా ప్రాంతంలోని తన షోరూమ్‌లో బాధిత బాలికను పనిలో పెట్టుకున్నాడు. దుకాణం పనుల నిమిత్తం బయటకు వెళ్లడానికి వీలుగా ఆమెకు స్కూటర్ నేర్పిస్తానని, కొత్త వాహనం కూడా కొనిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో ఒకరోజు ఆమెను బిటూర్ ప్రాంతంలోని తన ఫామ్‌హౌస్‌కు తీసుకువెళ్లి, అక్కడ గదిలో బంధించి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ కుటుంబాన్ని జైల్లో పెట్టిస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతూ.. ఫామ్‌హౌస్‌తో పాటు దుకాణం వెనుక ఉన్న గదిలోనూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నరకం లాంటి ఈ పరిస్థితులను భరించలేక సదరు బాలిక చివరకు తన తండ్రికి నిజం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి బిటూర్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా, అక్కడ లైంగిక సామర్థ్య మందులు, అసభ్యకరమైన వస్తువులు లభ్యమయ్యాయి. ఆ ప్రాంగణాన్ని అతడు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల కోసమే వాడుతున్నట్లు ఆధారాలు సేకరించారు. కాగా, నిందితుడు రస్తోగికి ఇలాంటి నేర చరిత్ర ఉండటం ఇదే మొదటిసారి కాదు. గతంలో పంజాబ్‌కు చెందిన ఒక యువతిని పనిలో పెట్టుకుని ఆమెపై కూడా అత్యాచారం చేసిన కేసులో 9 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి, బెయిల్ మీద బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.  
Go Back to Shorts
Ashok Kumar Rastogi
Ashoka Jewelers Kanpur
Kanpur Minor Rape Case
POCSO Act Uttar Pradesh
Bithoor Farmhouse Rape Case
Jeweler Arrested Kanpur

More Telugu News