కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే?

Kalvakuntla Kavitha response on KCR invitation to rejoin BRS
  • కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదన్న కవిత
  • బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను మూసేశానని వ్యాఖ్య
  • తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’తోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానన్న కవిత
తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుతో గానీ, ఆ పార్టీతో గానీ తిరిగి కలిసే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను ఇప్పటికే పూర్తిగా మూసేశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నూతన పార్టీ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) ద్వారానే సరికొత్త చరిత్రను లిఖిస్తానని ఆమె ఉద్ఘాటించారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత, ఒకవేళ కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే వెళ్తారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. "ఖచ్చితంగా ఆ అధ్యాయం ముగిసింది. జీవితంలో కొన్నిసార్లు పేజీలు తిప్పాలి, మరికొన్నిసార్లు పుస్తకాలనే మూసివేయాలి. నేను బీఆర్ఎస్ అనే పుస్తకాన్ని ఎప్పుడో మూసివేశాను" అని ఆమె పేర్కొన్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. హరీశ్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించారని ఆమె బహిరంగంగా ఆరోపణలు చేయడంతో పార్టీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె 'తెలంగాణ రక్షణ సేన' పేరుతో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.

బీఆర్ఎస్ పాలనలో తనకు అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయని, సామాజిక న్యాయం, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు వంటి హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని కవిత విమర్శించారు. ప్రాంతీయ భావజాలం నుంచి బీఆర్ఎస్ వైదొలగడం వల్లే ప్రజలకు దూరమైందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీ మద్యం కేసులో తనపై దిగువ కోర్టులో ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని, ఈడీ, సీబీఐ అప్పీళ్ల అంశాన్ని న్యాయవ్యవస్థకే వదిలేస్తున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
K Chandrashekar Rao
Telangana Rakshana Sena
Bharat Rashtra Samithi

More Telugu News