హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు!

Hyderabad drug bust Eagle squad busts Goa network with Tollywood links
  • గోవా కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా
  • టాలీవుడ్ వర్గాలకు కొకైన్ సరఫరా ఆరోపణలు
  • ఈగిల్ ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారుల అరెస్ట్
  • ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పరారీ
  • నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 44 మంది గుర్తింపు
గోవా కేంద్రంగా హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న భారీ నెట్‌వర్క్‌ను తెలంగాణ ‘ఈగిల్’ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) దళాలు ఛేదించాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా 19 మంది డ్రగ్స్ వినియోగదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దందాలో టాలీవుడ్ వర్గాలకు కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో తీవ్ర కలకలం రేగుతోంది.

వివరాల్లోకి వెళితే.. ‘ఈగిల్’ వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు అందిన సమాచారంతో అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గోవాలోని వాగేటర్ బీచ్ సమీపంలోని ఒక హాస్టల్‌లో నివసిస్తూ కొమ్మరాజు చక్రపాణి అలియాస్ చక్రి, అతని స్నేహితుడు హర్షిత్ రెడ్డి ఈ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. వీరు బెంగళూరు నుంచి కొకైన్, ఎండీఎంఏ పిల్స్, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి గోవా మీదుగా హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా, ఒడిశా నుంచి హ్యాష్ ఆయిల్‌ను తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

నిందితుల ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలను విశ్లేషించిన అధికారులు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ (మల్కాజ్‌గిరి), ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సుమారు 44 మంది వినియోగదారులను గుర్తించారు. జూన్ 15న 15 ప్రత్యేక బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించి 19 మందిని అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 14 మందికి గంజాయి (టీహెచ్‌సీ), మరొకరికి గంజాయితో పాటు మెథాంపెటమైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరందరికీ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు, అనంతరం డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించనున్నారు.

పట్టుబడిన వారు చక్రి, హర్షిత్ రెడ్డిల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల ఖాతాలకు ఇటీవలే సుమారు రూ.3.12 లక్షలు బదిలీ అయినట్లు డిజిటల్ లావాదేవీల ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా చక్రపాణి టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురికి కొకైన్ సరఫరా చేసినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డిలపై 2019లోనే ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరిద్దరూ పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌కు ఉన్న అంతర్రాష్ట్ర సంబంధాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Eagle Squad
Hyderabad Drug Bust
Goa Drug Network
Tollywood Drug Links
Kommaraju Chakrapani
Telangana Drug Enforcement

More Telugu News