సింగపూర్ సమ్మిట్‌లో అమరావతి బ్రాండింగ్.. చంద్రబాబు కీలక ప్రసంగం

Chandrababu Naidu Brands Amaravati at Singapore Summit with Key Speech
  • సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
  • సరికొత్త ఆలోచనలతో అమరావతికి రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
  • అభివృద్ధికి, సంపద సృష్టికి సైబరాబాద్ నిదర్శనమని వ్యాఖ్య
  • ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
  • సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాళ్లను సందర్శించిన ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అవకాశాల గనిగా అభివర్ణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సరికొత్త ఆలోచనలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. సింగపూర్‌లో జరుగుతున్న 'వరల్డ్ సిటీస్ సమ్మిట్'లో భాగంగా తన పర్యటన రెండో రోజు ఆయన 'కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్' అనే అంశంపై ప్లీనరీలో ప్రసంగించారు. అమరావతిని ఒక ప్రజా రాజధానిగా, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతిని కేవలం పరిపాలనా నగరంగా కాకుండా, ఒక నాలెడ్జ్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు వస్తున్నాయని చంద్రబాబు వివరించారు. క్రీడలు, ఆర్థిక, విజ్ఞానం, న్యాయ, పర్యాటక, ఆరోగ్యం, మీడియా వంటి థీమ్ లతో అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ హబ్, డిజిటల్ మౌలిక వసతులు దీనికి ప్రత్యేకతను తెస్తాయని పేర్కొన్నారు. 

21 కిలోమీటర్ల కృష్ణా నది తీరం వెంబడి వాటర్ ఫ్రంట్ సిటీగా, ఇన్నర్-ఔటర్ రింగ్ రోడ్లు, ఐకానిక్ వంతెనలతో అమరావతి అద్భుతంగా రూపుదిద్దుకోనుందని అన్నారు. సైక్లింగ్, వాకింగ్ ట్రాక్‌లు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, భూగర్భ యుటిలిటీస్, గ్రీన్ ఎనర్జీ, నెట్ జీరో ఉద్గారాల లక్ష్యంగా రాజధాని నిర్మాణం జరుగుతోందని చెప్పారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, తమ పిలుపు మేరకు రైతులు 35 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారని, ఆ భూమిని అభివృద్ధి చేసి రైతులకు ప్లాట్ల రూపంలో తిరిగి ఇచ్చే ల్యాండ్ పూలింగ్ మోడల్‌ను ఆయన సదస్సులో వివరించారు. అభివృద్ధి ద్వారానే సంపద సృష్టి సాధ్యమని చెప్పేందుకు తాను గతంలో నిర్మించిన సైబరాబాద్‌ను చంద్రబాబు ఉదాహరణగా చూపారు. 

"25 ఏళ్ల క్రితం నేను ఐటీ గురించి మాట్లాడాను. భవిష్యత్తును ముందుగానే ఊహించి 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్' తీసుకున్నాం. దాని ఫలితంగానే నేడు తెలుగువారు తలసరి ఆదాయంలో ముందున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి ఆలోచిస్తున్నాం," అని ఆయన అన్నారు. నాడు తాను నిర్మించిన సైబరాబాద్ నేడు తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని, ఒకప్పుడు ఎకరం రూ.2 లక్షలు ఉన్న భూమి ఇప్పుడు రూ.200 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి కొత్త నగరాన్ని నిర్మించే అవకాశం తనకు దక్కిందని పేర్కొన్నారు.

ప్రసంగం అనంతరం, సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సింగపూర్ ఇన్నోవేషన్, టెక్నాలజీ ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. సింగపూర్ పెవిలియన్‌లోని అత్యాధునిక పట్టణాభివృద్ధి నమూనాలను, 'ఇన్నోవేటర్స్ అలే'లో స్టార్టప్‌ల ఆవిష్కరణలను, గూగుల్ స్టాల్‌ను ఆసక్తిగా పరిశీలించారు. టెక్నాలజీ ఆధారిత పాలనలో సింగపూర్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati Branding
World Cities Summit
Singapore Investment
Smart City Development
Andhra Pradesh Capital

More Telugu News