ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏదో తెలుసా?

Pakistan named world most polluted country in IQAir report
  • తాజాగా విడుదలైన ‘ఐక్యూఎయిర్‌’ నివేదిక
  • ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్థాన్‌
  • పీఎం2.5 స్థాయి 67.3 మైక్రోగ్రాములు
  • డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల కంటే 13 రెట్లు అధికం
  • 38.2 మైక్రోగ్రాముల పీఎం2.5తో ఆరో స్థానంలో భారత్‌
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశంగా పాకిస్థాన్‌ నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన వాయు నాణ్యత పరిశోధనా సంస్థ ‘ఐక్యూఎయిర్‌’ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో సగటు పీఎం2.5 స్థాయి 67.3 మైక్రోగ్రాములు/క్యూబిక్‌ మీటర్‌గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సూచించిన పరిమితి ఐదు మైక్రోగ్రాములతో పోలిస్తే దాదాపు 13 రెట్లు ఎక్కువ.

‘ఐక్యూఎయిర్‌’ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్‌ (66.1), తజికిస్థాన్‌ (46.3), చాద్‌ (45.4), డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో (40.8) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 38.2 మైక్రోగ్రాముల పీఎం2.5 స్థాయితో భారత్‌ ఆరో అత్యంత కాలుష్య దేశంగా నమోదైంది.

వాహనాల నుంచి వెలువడే కాలుష్యం, బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి, పరిశ్రమల ఉద్గారాలు, నిర్మాణ రంగం, పంట వ్యర్థాల దహనం, గృహ అవసరాలకు బయోమాస్‌ ఇంధనాల వినియోగం వంటి అంశాలు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు ప్రపంచంలోనే అత్యంత అధ్వాన వాయు నాణ్యత సమస్యను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది.

అత్యంత సూక్ష్మమైన పీఎం2.5 కణాలు నేరుగా ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థలోకి చేరి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాము పరిశీలించిన దేశాల్లో 91 శాతం దేశాలు డబ్ల్యూహెచ్‌ఓ సూచించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయాయని ఐక్యూఎయిర్‌ నివేదిక వెల్లడించింది.
Go Back to Shorts
Pakistan
Most polluted countries
IQAir report
India air quality ranking
PM2 5 levels
South Asia air pollution

More Telugu News