స్టార్‌డమ్‌తో నాలో అహంకారం పెరిగింది: సమంత
- స్టార్‌డమ్‌ను చూసి ఆశ్చర్యపోయానన్న సమంత
- వరుస హిట్లతో స్టార్‌డమ్‌కు బానిసయ్యానని వ్యాఖ్య
- నటిగా అహంకారం పెరిగి తనకు ముగింపు లేదనుకున్నానని వెల్లడి
- అనారోగ్యంతో తీసుకున్న విరామం ఆలోచనలను మార్చిందన్న హీరోయిన్
- జూన్ 19న ప్రేక్షకుల ముందుకు ‘మా ఇంటి బంగారం’ సినిమా
‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘చిన్న పట్టణం నుంచి వచ్చిన ఓ అమ్మాయిగా స్టార్‌డమ్‌ను అనుభవించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ప్రేక్షకులు నా పేరును అరుస్తూ, నా సినిమాల కోసం ఎదురుచూడటం చూసి మరింత కష్టపడ్డాను. ఓ దశలో స్టార్‌డమ్ అనే ఆటకు బానిసయ్యాను. ఏడాదిలో ఐదు సినిమాలు చేశాను. అవన్నీ హిట్లు కావడంతో నాకో ‘గోల్డెన్ లెగ్’ ఉందని అందరూ అనేవారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఉండాలనే ఒత్తిడిని నేనే నాపై పెట్టుకున్నా’’ అని చెప్పారు.
‘‘అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలనుకునేదాన్ని. నటిగా నాకు ముగింపు ఉండదనుకున్నాను. అదే ఒక రకమైన అహంకారం. కానీ ఆ విరామం తర్వాత నా కెరీర్‌కూ ఓ ముగింపు ఉంటుందనే విషయాన్ని అర్థం చేసుకున్నా. అది నా ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చింది. తిరిగి సినిమాల్లోకి వస్తే కొన్ని పాత అలవాట్లు మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నా’’ అని సమంత తెలిపారు.
2022లో తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న విడుదల కానుంది.