మెస్సీ, రొనాల్డో సరసన భారత మహిళా క్రికెటర్.. స్మృతి మంధాన‌కు అరుదైన గౌర‌వం

Smriti Mandhana named in Time 100 Most Influential People in Sports list
  • టైమ్ 100 అత్యంత ప్రభావశీలుర జాబితాలో స్మృతి మంధాన
  • ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపు
  • మెస్సీ, రొనాల్డో, లెబ్రాన్ జేమ్స్ వంటి దిగ్గజాల సరసన చోటు
  • రికార్డులు, జట్టు విజయాలతో మహిళల క్రికెట్‌లో ఆమెది కీలక పాత్ర
  • డ‌బ్ల్యూపీఎల్‌ టైటిళ్లు, ప్రపంచకప్ విజయంతో అరుదైన రికార్డులు
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత 'టైమ్' మ్యాగజైన్ 2026 సంవత్సరానికి గాను ప్రకటించిన ‘క్రీడారంగంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల’ జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ జాబితాలో స్థానం పొందిన ఏకైక భారత క్రీడాకారిణిగా స్మృతి నిలవడం విశేషం. ఈ ఘనతతో ఆమె ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, బాస్కెట్‌బాల్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుల సరసన చేరింది.

ప్రపంచ క్రీడారంగాన్ని తమ ప్రతిభ, నాయకత్వ పటిమ, పెట్టుబడులతో ప్రభావితం చేస్తున్న క్రీడాకారులు, కోచ్‌లు, నిర్వాహకులతో ఈ జాబితాను రూపొందించినట్లు టైమ్ మ్యాగజైన్ వివరించింది. మహిళల క్రికెట్‌లో సరిహద్దులను చెరిపేస్తూ, అద్భుతమైన వ్యక్తిగత రికార్డులతో పాటు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందుకే స్మృతిని ఈ జాబితాలో చేర్చినట్లు తన ప్రొఫైల్‌లో పేర్కొంది. "స్మృతి కోసం రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి" అని ప్రశంసించింది.

స్మృతి మంధాన సాధించిన పలు రికార్డులను కూడా టైమ్ మ్యాగజైన్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత మహిళగా, మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలోనూ (టెస్ట్, వన్డే, టీ20) సెంచరీలు నమోదు చేసిన మొదటి భారత క్రీడాకారిణిగా ఆమె ఘనతను గుర్తుచేసింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 17 సెంచరీలతో అత్యధిక శతకాలు బాదిన క్రీడాకారిణిగా సమంగా నిలిచారని, ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారని వివరించింది.

కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా ఆమె నాయకత్వంలో జట్టుకు అందిన విజయాలను కూడా టైమ్ హైలైట్ చేసింది. 29 ఏళ్ల స్మృతి నాయకత్వంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2024, 2026 సంవత్సరాల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) టైటిళ్లను గెలుచుకుంది. గత ఏడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఒకరిగా నిలిచింది. 2024లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన ఆమె, 2025లో తన రికార్డును తానే అధిగమించడం ఆమె నిలకడకు నిదర్శనం.
Go Back to Shorts
Smriti Mandhana
Time Magazine 100 Most Influential
Indian Womens Cricket Team
Royal Challengers Bangalore RCB
Womens Premier League WPL
Lionel Messi Cristiano Ronaldo

More Telugu News