ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్

South African cricket legend Jonty Rhodes meets AP Minister Nara Lokesh
  • ఏపీలో క్రీడాభివృద్ధిపై జాంటీ రోడ్స్‌తో లోకేశ్ చర్చ
  • క్రీడలు, యువత అభివృద్ధిపై ఇరువురి మధ్య సమాలోచనలు 
  • ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మిస్తామన్న లోకేశ్
  • అంతర్జాతీయ పద్ధతులతో క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వెల్లడి
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధి, క్రీడల్లో అత్యుత్తమ సంస్కృతిని నెలకొల్పడం వంటి అంశాలపై తామిద్దరం ఆసక్తికరంగా చర్చించుకున్నామని లోకేశ్ తెలిపారు. ప్రపంచస్థాయి క్రీడా వ్యవస్థను నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

అంతర్జాతీయంగా అనుసరిస్తున్న అత్యుత్తమ పద్ధతులను అందిపుచ్చుకుని, భవిష్యత్ ఛాంపియన్‌లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తామని మంత్రి లోకేశ్ వివరించారు. రాష్ట్రంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించి, ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ భేటీ సందర్భంగా జాంటీ రోడ్స్ తాను సంతకం చేసిన బ్యాట్ ను లోకేశ్ కు బహూకరించారు. అటు, లోకేశ్ కూడా తన యువగళం పాదయాత్ర విశేషాల పుస్తకాన్ని రోడ్స్ కు అందించారు.
Go Back to Shorts
Nara Lokesh
Jonty Rhodes
Andhra Pradesh Sports
Youth Development
AP IT Minister
South African Cricketer

More Telugu News