చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి
- విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి
- అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడి
- దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందన్న కేంద్ర మంత్రి
విజయవాడ వన్‌టౌన్‌లోని వాజ్‌పేయి పార్క్‌లో నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టి పార్క్ పరిసరాలను శుభ్రం చేసిన ఆయన.. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరిలతో కలిసి మొక్కలు నాటారు. అక్కడి వాకర్స్‌తో ‘చాయ్ పే చర్చ’ జరిపి మోదీ ప్రభుత్వ విజయాలను వివరించారు.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే రూ. 15,000 కోట్లు కేటాయించామని, హడ్కో (HUDCO) ద్వారా మరో రూ. 11,000 కోట్లు అందించామని వెల్లడించారు. అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్‌తో పాటు అత్యుత్తమ రోడ్డు కనెక్టివిటీని పెంచుతున్నట్లు చెప్పారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఏకంగా 8 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు.