ఇకపై డిగ్రీలు ఉంటే చాలదు.. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు!
- ఎంబీఏల ప్రాధాన్యం తగ్గుతోందన్న సీఈఏ
- వృత్తి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతోందని వెల్లడి
- AI భర్తీ చేయలేని ఉద్యోగాలపై దృష్టి పెట్టాలని సూచన
- ఆరోగ్యం కూడా ఉద్యోగాలకు కీలకమన్న నాగేశ్వరన్
- స్కిల్స్, ఫిట్నెస్పై దృష్టి పెట్టాలని యువతకు సూచన
ఓ పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక వెంటనే ఎంబీఏ, పీజీ లేదా యూపీఎస్సీ వంటి పరీక్షల వైపు వెళ్లడం చాలా మంది యువతలో కనిపిస్తున్న ధోరణి అని చెప్పారు. అయితే ఆ చదువులు నిజంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయా లేదా అన్న అంశాన్ని కూడా ఆలోచించాలని సూచించారు. సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏలకు గ్లోబలైజేషన్ కాలంలో భారీ డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో వెల్డింగ్, ప్లంబింగ్, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్ పనుల వంటి వృత్తి నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో ఇలాంటి వృత్తులకు ఎంతో గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. అలాగే కౌన్సెలింగ్, కేర్గివింగ్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో మానవ నైపుణ్యాలను కృత్రిమ మేధస్సు పూర్తిగా భర్తీ చేయలేదని చెప్పారు.
ఆరోగ్యం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కంటే ముందే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయనే అంశం ఆందోళన కలిగిస్తోందన్నారు. శారీరక శ్రమ తగ్గడం, వ్యాయామం లేకపోవడం, ఆలస్యంగా భోజనం చేయడం వంటి అలవాట్లు ఊబకాయం పెరగడానికి కారణమవుతున్నాయని చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, మనిషి ఆలోచన, నిర్ణయాలు తీసుకునే శక్తి, నైపుణ్యం అవసరమైన రంగాల్లోనే భవిష్యత్తు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే యువత డిగ్రీలతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్, వ్యక్తిగత ఆరోగ్యంపైనా సమానంగా దృష్టి పెట్టాలని సూచించారు.