మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య

Mangibai Tanwar walks 6 km to police station with chain around neck after husband torture
  • భర్త పైశాచికత్వం.. భార్యను గొలుసుతో స్తంభానికి కట్టేసిన వైనం
  • వేడి రాడ్‌తో వాతలు పెట్టి 24 గంటలు బంధించిన దుర్మార్గం
  • రాయితో తాళం పగలగొట్టి మెడలో గొలుసుతోనే తప్పించుకున్న మహిళ
  • 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితురాలు
  • నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే కాలయముడై భార్యను 24 గంటల పాటు నరకయాతనకు గురిచేశాడు. మెడకు ఇనుప గొలుసు బిగించి, స్తంభానికి కట్టి, వేడి రాడ్‌తో వాతలు పెట్టి తన పైశాచికత్వాన్ని చాటుకున్నాడు. అయితే, ఆ నరకం నుంచి అసామాన్య ధైర్యంతో తప్పించుకున్న ఆ మహిళ, మెడలో గొలుసుతోనే 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనను బంధించిన గొలుసునే భర్త అకృత్యాలకు సాక్ష్యంగా మార్చింది.

బాధితురాలు మంగీబాయి తన్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల‌ 10వ తేదీ సాయంత్రం ఆమె భర్త మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. రాత్రి భోజనం తర్వాత ఆమెను దూషించడం ప్రారంభించాడు. ఆమె ఎదురు తిరగడంతో క‌ర్ర‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. దెబ్బలు తాళలేక, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మంగీబాయి రాత్రికి రాత్రే ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

కిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌కు నడిచి వెళ్తుండగా, మార్గమధ్యంలో ఓ ఆలయం వద్ద భర్త ఆమెను అడ్డగించి, మళ్లీ దాడి చేసి బలవంతంగా గ్రామానికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకొచ్చాక అతని రాక్షసత్వం మరింత పెరిగింది. "ఇప్పుడెలా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నాపై ఫిర్యాదు చేస్తావో చూస్తా" అంటూ ఆమె మెడకు ఇనుప గొలుసు చుట్టి, దానికి తాళం వేసి ఇంటిలోని ఓ స్తంభానికి కట్టేశాడు.

అంతటితో ఆగకుండా గ్యాస్ స్టవ్‌పై ఇనుప రాడ్‌ను వేడి చేసి ఆమె నడుము, తుంటి, కుడి తొడపై వాతలు పెట్టాడు. ఆమె నొప్పితో ఎంత అరిచినా ఎవరూ సహాయానికి రాలేదు. దాదాపు 24 గంటల పాటు ఆమెను ఆ గదిలోనే బంధించాడు. ఈ సమయంలో పోలీసుల వద్దకు వెళ్లకుండా ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు గ్రామస్థులతో పంచాయితీ పెట్టేందుకు ప్రయత్నించాడు. భర్త హింసను భరించలేక, ఆమె తప్పించుకోవడానికి అంగీకరించినట్లు నటించింది.

భర్త పంచాయితీ కోసం గ్రామస్థులను పిలవడానికి బయటకు వెళ్లినప్పుడు, మంగీబాయికి ఒంటరిగా ఉండే అవకాశం దొరికింది. అక్కడ కనిపించిన ఒక రాయిని తీసుకుని గొలుసుకు వేసిన తాళాన్ని ప‌గ‌ల‌గొట్టి అక్క‌డి నుంచి త‌ప్పించుకుంది. చిమ్మచీకటిలో మెడకు వేలాడుతున్న గొలుసు, తాళంతోనే ఆమె కిల్చిపూర్ వైపు నడక ప్రారంభించింది. ముళ్ల కంపలు, రాళ్ల దారిలో నడుస్తుండగా ఆమె పాదాలకు తీవ్ర గాయాలయ్యాయి. దారిలో ఆమెను చూసిన కొందరు మానసిక అనారోగ్యంతో ఉందని భావించారు. కానీ, ఒక వ్యక్తి మాత్రం ఆమె పరిస్థితిని గమనించి తినడానికి కొంత ఆహారం ఇచ్చాడు.

రాత్రి 10 గంటల సమయంలో మంగీబాయి కిల్చిపూర్ పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడి సిబ్బంది సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. మెడలో ఇనుప గొలుసు, శరీరంపై కాలిన గాయాలతో కనిపించిన ఆమె, జరిగిన దారుణాన్ని వివరిస్తూ కన్నీరుమున్నీరైంది. పోలీసులు వెంటనే గొలుసును తొలగించి, ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కిల్చిపూర్ ఎస్‌హెచ్‌ఓ కమల్ సింగ్ గెహ్లాట్ నేతృత్వంలో కేసు నమోదు చేసి, నిందితుడైన భర్తను అరెస్ట్ చేశారు. ఏ గొలుసుతో అయితే ఆమెను బంధించి నోరు నొక్కాలని చూశాడో, అదే గొలుసు అతని దుర్మార్గానికి బలమైన సాక్ష్యంగా నిలిచింది.
Go Back to Shorts
Mangibai Tanwar
Madhya Pradesh crime news
Woman chained by husband
Domestic violence Rajgarh
Khilchipur police station
Husband arrested for torture

More Telugu News